ఆర్టీసీ ఐకాస నేతృత్వంలో జరిగే సమ్మెకు కాంగ్రెస్ పక్షాన అన్ని విధాలా అండగా ఉంటామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రకటించారు. అసెంబ్లీలోని కాంగ్రెస్ శాసనసభాపక్ష కార్యాలయంలో ఉన్న భట్టి విక్రమార్కను కలిసేందుకు వచ్చిన ఆర్టీసీ ఐకాస నేతలను అసెంబ్లీ ప్రవేశ ద్వారం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. లోనికి వెళ్లడానికి స్పీకర్ అనుమతి కావాలని పోలీసులు పట్టుబట్టారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడేందుకు సీఎల్పీ నేత భట్టి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. భట్టి విక్రమార్కనే బయటకు వచ్చి ఆర్టీసీ ఐకాస నేతలతో మాట్లాడారు. తన మద్దతు ప్రకటించారు. శాసనసభలో ప్రజా సమస్యల మీద చర్చిస్తారు కానీ... బాధలు చెప్పుకునేందుకు వచ్చే వారిని అడ్డుకుంటారని... ఇలా చేయటం ప్రజాస్వామ్యాన్ని అవమానపర్చడమేనని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మె ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని... ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాలని కార్మికులకు ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి విజ్ఞప్తి చేశారు. తమపై పెడుతున్న తప్పుడు కేసులకు భయపడేది లేదన్నారు. సమస్యలు పరిష్కారం అయ్యేవరకు సమ్మె కొనసాగిస్తామని అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు.
ఈ కథనం చదవండి: ధన త్రయోదశి రోజు ఇలా చేస్తే... లక్ష్మీ కటాక్షం మీ సొంతం!