Tsrtc Independence Day Special Offers: స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాల సందర్బంగా ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ పలు ఆఫర్లను ప్రకటించింది. దీనికి సంబంధించిన వివరాలను ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్, ఎండీ సజ్జన్నార్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని ఆర్టీసీ 12 రోజులపాటు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. హైదరాబాద్, ఖమ్మం, నిజామాబాద్ వంటి పెద్ద పెద్ద బస్ స్టేషన్లలో 32 మంది స్వాతంత్య్ర సమరయోధుల అనుభవాలను షార్ట్ ఫిల్మ్‌లుగా రూపొందించి ఆగస్ట్ 15 నుంచి 20వ తేదీ వరకు ప్రదర్శించనున్నారు.
ఈ సందర్బంగా ఆర్టీసీ ఉద్యోగులతో 13వ తేదీన నెక్లెస్ రోడ్లో పరేడ్ నిర్వహించనున్నారు. 9వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డిపోల్లో ఉదయం 11 గంటలకు జాతీయగీతం ఆలపించనున్నారు. ఆగస్ట్ 15న 75 ఏళ్లు దాటిన వృద్దులకు ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కల్పించారు. ఆరోజు రూ.120 ఉన్న టీ-24 టికెట్ ను కేవలం రూ.75లకే అందించాలని నిర్ణయించారు. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం వెళ్లాలనుకునే భక్తులకు ఈనెల 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు రూ.75ల రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు.
ఆగస్ట్ 15న కిలో బరువు ఉండి 75 కిలోమీటర్ల దూరం వరకు అన్ని కార్గో పార్శిళ్లను ఉచితంగా చేరవేయాలని నిర్ణయించారు. దూర ప్రాంతాలకు రెగ్యులర్‌గా ప్రయాణించే 75 మంది ప్రయాణికులకు.. తర్వాత చేసే ప్రయాణానికి సంబంధించిన ఒక ఉచిత టికెట్‌ను అందజేస్తామని చెప్పారు. విమానాశ్రయానికి పుష్పక్ బస్సుల్లో వెళ్లే ప్రయాణికులకు ఆగస్ట్ 15న 75శాతం ఛార్జీలనే వసూలు చేస్తారు. ఆగస్ట్ 18వ తేదీన రక్తదాన శిబిరం నిర్వహించి 7,500 యూనిట్ల రక్తాన్ని సేకరించాలని నిర్ణయించారు. ఈనెల 15వ తేదీ నుంచి 22వ తేదీ వరకు 75 ఏళ్లు దాటిన వృద్దులకు తార్నాక ఆర్టీసీ ఆసుపత్రిలో ఉచిత హెల్త్ చెకప్‌తో పాటు మందులను అందించనున్నారు. 75 ఏళ్ల లోపు ఉన్న వారికి రూ.750కే హెల్త్ ప్యాకేజీతో పాటు.. మందులపై 75శాతం మందుల కొనుగోలుపై రాయితీ అందించనున్నారు.
ఇవీ చదవండి: young Woman rape in Banjara Hills : మరో దారుణం.. యువతిని గదిలో బంధించి అత్యాచారం