ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా బస్సు సర్వీసులను నడపాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు బాబు, ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి ప్రభుత్వానికి విన్నవించారు. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆరో ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ విద్యానగర్‌లోని కార్యాలయంలో యూనియన్ జెండాను బాబు ఆవిష్కరించారు.
ఆర్టీసీలో కార్మికుల సమస్యలపై యూనియన్లు పోరాడకుండా ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు ఆర్టీసీ యాజమాన్యం అడ్డు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యూనియన్లు తమ ధర్మాన్ని నిర్వర్తించే విధంగా యాజమాన్యాలకు ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రూ.50 లక్షల బీమా సదుపాయం చెల్లించాలి...
ప్రస్తుత తరుణంలో ఇష్టారాజ్యంగా బస్సు సర్వీసులు నడపడం వల్ల డిపోలో డీజిల్ ఖర్చుకు అయ్యే మొత్తం కూడా రావడం లేదని వారు తెలిపారు. ఈ విషయం యాజమాన్యానికి తెలియదా అని వారు ప్రశ్నించారు. ప్రభుత్వం చెప్పిన విధంగా కాకుండా కార్మికుల జీతాల్లో కోతలు విధిస్తున్నారని పేర్కొన్నారు. విధుల్లో ఉన్న కార్మికులకు కరోనా వ్యాధి సోకి ఏదైనా ప్రమాదం జరిగితే ఆయా కుటుంబాలకు రూ.50 లక్షల బీమా సదుపాయం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.