హైదరాబాద్ నగరంలోని ఆర్టీసీలో పనిచేసే ఓ వ్యక్తి సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటాడు. ఆయన్ను కరోనా మహమ్మారి ఆవహించింది. ఆసుపత్రుల్లో చేరుద్దామనుకునే సరికే ఊపిరి తీసుకోవడం కష్టమైంది. ఆంబులెన్సులో పలు ఆసుపత్రులకు తిరిగినా పడక దొరక్కపోవడంతో అందులోనే ప్రాణాలొదిలాడు.
మహ్మద్ నిస్సార్ నగరంలోని ఓ ఆర్టీసీ డిపో కంట్రోలర్. కరోనాను ఎదుర్కోవడంపై చైతన్య గీతం రాసిన ఆయన.. చివరకు అదే మహమ్మారి బారినపడి మరణించడం విషాదకరం. నాలుగైదు రోజులుగా జ్వరం తగ్గకపోవడంతో పరీక్షలు చేయించుకున్నారు. పాజిటివ్ అని తెలిసిన కొద్దిసేపటికే ఊపిరి పీల్చుకోవడం కష్టమైంది. మంగళవారం పలు ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. చివరకు గాంధీ ఆసుపత్రిలో చేర్చుకోగా బుధవారం ప్రాణాలొదిలారు. నగరంలోని మరో డిపోలో కంట్రోలర్‌గా పని చేస్తున్న మహిళ కరోనాతో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.
టీఎస్‌ఆర్టీసీలో మొత్తం 49 వేల మంది ఉద్యోగులున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో 21 వేల మంది ఉంటారు. నగర పరిధిలో ఇప్పటికే ముగ్గురు ఆర్టీసీ ఉద్యోగులను కరోనా బలిగొనగా మరో 27 మంది మహమ్మారితో పోరాడుతున్నారు. టీఎస్‌ఆర్టీసీకి తార్నాకలో ప్రత్యేక ఆసుపత్రి ఉంది. 200 పడకలున్నాయి. ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు కలిపి మొత్తం మీద 1.50 లక్షల మంది ఇక్కడే వైద్య సేవలు పొందుతుంటారు. ప్రత్యేక ఆసుపత్రి ఉన్నా కొవిడ్-19 బాధితులకు చికిత్సలు అందించే సదుపాయం లేదని ఉద్యోగులు వాపోతున్నారు.
రైల్వే ఆదర్శం
కరోనా కష్ట కాలంలో తమ ఉద్యోగుల కోసం తార్నాకలోని ప్రత్యేక ఆసుపత్రిలో ఒక ఐసోలేషన్ వార్డును తెరవాలనే ఆలోచన ఆర్టీసీ చేయలేదు. వెంటిలేటర్లు లేక.. ప్రాణవాయువు అందక చాలామంది చనిపోతున్న తరుణంలోనైనా ఆలోచన చేయాలని కోరుతున్నారు. మరోవైపు దక్షిణ మధ్య రైల్వే రైల్వే శిక్షణ సంస్థలను క్వారంటైన్ సెంటర్లుగా మార్చేసింది. లాలాగూడలోని రైల్వే ఆసుపత్రిలో 140 పడకలను సిద్ధం చేసింది. 500 వరకూ రైల్వే బోగీలను నగరంలోని పలు స్టేషన్లలో అందుబాటులో ఉంచి, ఐసోలేషన్ బెడ్లుగా మార్చింది. ఈ చొరవ ఆర్టీసీ ఎందుకు చేయలేదనే విమర్శలు వస్తున్నాయి. ఉద్యోగులు చనిపోతున్నా ఆర్టీసీ ఉన్నతాధికారుల్లో చలనం లేకపోవడాన్ని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు తప్పు పడుతున్నాయి.
అవకాశమున్నా ఆలోచన చేయలేదు
తార్నాకలోని టీఎస్‌ఆర్టీసీ ఆసుపత్రి విశాలంగా ఉంటుంది. ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. అయినా ఒక్క వెంటిలేటర్ లేదని వైద్యులు చెబుతున్నారు. ఐసోలేషన్ వార్డులుగా తీర్చిదిద్దకపోయినా కనీసం కరోనా బాధితులకు ప్రాణవాయువు అందేలా చేస్తే సరిపోతుందని ఉద్యోగులు సూచిస్తున్నారు. లేదంటే హకీంపేటలోని ఆర్టీసీ శిక్షణ కేంద్రంలోనైనా ఐసోలేషన్ వార్డులను రూపొందించడం, క్వారంటైన్ సెంటర్లుగా తీర్చిదిద్దడం చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో ఎప్పుడూ లేని నిర్లిప్తత చోటుచేసుకుందని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండిః ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనా భయం.. జంకుతున్న అధికారులు