కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్‌డౌన్ చేపట్టిన ప్రభుత్వం మార్చి నాలుగోవారం నుంచి బస్సులను నిలిపి వేసింది. తాజాగా కేంద్రం వెసులుబాటు కల్పించడంతో మంగళవారం నుంచి బస్సులు నడపాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న కేబినెట్ భేటీలో ఈ విషయమై నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఆర్టీసీ బస్సులకు అనుమతివ్వడంతో పాటు లాక్‌డౌన్ విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో చర్చించనున్నారు.
ఆర్టీసీ అధికారులతో పువ్వాడ సమావేశం..
సోమవారం రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ అధ్యక్షతన ఆర్టీసీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ వర్గాలకు దీనిపై ఆదివారం రాత్రి సమాచారమిచ్చింది. సమావేశంలో బస్సుల నిర్వహణ ప్రణాళికను సిద్ధం చేసి సాయంత్రం జరిగే మంత్రిమండలి సమావేశంలో నివేదిస్తారని తెలిసింది. దీనిపై మంత్రిమండలి సమగ్రంగా చర్చించి, బస్సులు నడిపేందుకు అనుమతించే అవకాశం ఉన్నట్లు సమాచారం. వాస్తవానికి ఇప్పటికే 50 శాతం బస్సులను తిప్పేందుకు కేంద్ర అనుమతులున్నా వ్యాధి వ్యాపిస్తుందనే అనుమానంతో ప్రభుత్వం నడపలేదు.
ఆరెంజ్, గ్రీన్ జోన్లు పెరిగినందుకే..
తాజాగా రాష్ట్రంలో ఆరెంజ్, గ్రీన్ జోన్ల సంఖ్య పెరగడంతో బస్సులు నడపాలనే భావిస్తోంది. కంటైన్మెంట్ జోన్లు మినహా గ్రామీణ, జిల్లా, రాజధానికి నడిచే బస్సు సేవలు, వాటిల్లో పరిమితంగా ప్రయాణికులకు అనుమతించడం, వ్యక్తిగత దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకుంటారు. ఇతర రాష్ట్రాలకు బస్సు సర్వీసులపై ఇంకా స్పష్టత రాలేదు. ఆయా రాష్ట్రాల పరిస్థితులు, సమన్వయం ఇతర అంశాల ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకునే వీలుంది. సమావేశంలో కేంద్రమిచ్చిన ఇతర సడలింపులనూ పరిశీలిస్తారు.