TSPSC Paper Leakage Case Updates: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజ్‌లో నిందితులుగా ఉన్నవారు.. ఒకరికి తెలియకుండా మరొకరు తెరవెనుక బేరసారాలు చేశారని సిట్ అధికారులు గుర్తించారు. ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డి ద్వారా గ్రూప్-1, అసిస్టెంట్ ఇంజినీర్, టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ ప్రశ్నపత్రాలు లీక్ కాగానే నిందితులు తమ పరిచయాల ద్వారా కోచింగ్ కేంద్రాలు, అభ్యర్థులకు ప్రశ్నపత్రాలను విక్రయించినట్లు తేలింది. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు సిద్ధమవుతున్న టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులు, వారి బంధువులకు రహస్యంగా ప్రశ్నపత్రాలు అందజేశారు.
SIT Investigation In TSPSC Paper Leakage Case: వారంతా గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రాసి అర్హత సాధించారు. గ్రూప్-1 ప్రశ్నపత్రాలు లీకైన విషయాన్ని కమిషన్ ఉన్నతాధికారులు పసిగట్టలేకపోవడంతో.. తమ గుట్టు బయటపడదనే ధైర్యంతో ఏఈ ప్రశ్నపత్రాలను విక్రయించి సొమ్ము చేసుకున్నారు. రెండోసారి తమ ఎత్తులు ఫలించటంతో.. టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ ప్రశ్నపత్రాలతో మరింత లాభపడేందుకు సిద్ధమయ్యారు. పేపర్ లీకైనట్టు పోలీసులు కమిషన్‌ను అప్రమత్తం చేయడంతో గుట్టు బయటపడింది.
TSPSC పేపర్ లీకేజీలో ఇప్పటికి 14 మంది అరెస్ట్: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజ్ కేసులో సిట్ అధికారులు ఇప్పటివరకు 14 మందిని అరెస్ట్ చేశారు. ఏఈ సివిల్ ప్రశ్నపత్రం కొనుగోలు చేసినట్టు ఆధారాలు లభించటంతో మహబూబ్‌నగర్ జిల్లా ఫరూక్‌నగర్ మండలం నేరెళ్లపల్లి గ్రామానికి చెందిన రాజేందర్ కుమార్‌ను సిట్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. డిగ్రీ పూర్తి చేసిన రాజేందర్ కుమార్.. మహబూబ్‌నగర్ జిల్లా గండేడులో ఉపాధి హామీ పథకం క్వాలిటీ కంట్రోలర్‌గా పని చేసేవాడు. దిల్‌సుఖ్‌నగర్‌లోని కోచింగ్ సెంటర్‌లో పోటీ పరీక్షలకు సిద్ధమవుతుండగా.. డాక్యా నాయక్, తిరుపతయ్య పరిచయం అయ్యారు.
సిట్ అదుపులోకి మరో నలుగురు అనుమానితులు: రూ.10 లక్షలిస్తే ఏఈ ప్రశ్నపత్రం ఇప్పిస్తానంటూ రాజేందర్ కుమార్ నుంచి తిరుపతయ్య రూ.5 లక్షలు తీసుకున్నాడు. ఫలితాలు వచ్చాక మరో రూ.5 లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ప్రశ్నపత్రం తీసుకొని పరీక్ష రాశాడని సిట్ అధికారులు గుర్తించారు. సిట్ పోలీసులు తాజాగా మరో నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ కేసులో వారి పాత్ర ఉందని తేలితే అరెస్టు చేయనున్నారు. ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డి, డాక్యా నాయక్, రాజేశ్వర్‌ను సిట్ పోలీసులు రెండోసారి కస్టడీకి తీసుకున్నారు.
అసిస్టెంట్ ఇంజినీర్ ప్రశ్నపత్రం లీకేజ్‌లో కీలకంగా మారిన డాక్యా నాయక్, రాజేశ్వర్‌ను ప్రత్యేకంగా విచారించారు. ఈ నెల 4న వీరిద్దరు బస చేసిన కర్మన్‌ఘాట్‌లోని హోటల్‌కు తీసుకెళ్లి సమాచారాన్ని రాబట్టారు. ఇప్పటి వరకు ఏఈ ప్రశ్నపత్రాలు నీలేశ్‌నాయక్, గోపాల్‌నాయక్‌కు మాత్రమే రేణుక దంపతులు విక్రయించారని పోలీసులు భావించారు. దర్యాప్తులో ప్రశాంత్‌రెడ్డి, రాజేందర్ కుమార్‌కు కూడా ప్రశ్నపత్రాలు అమ్మినట్లు తేలడంతో వారిద్దరిని అరెస్ట్ చేశారు. ఈ నలుగురి ద్వారా ఇంకెంత మందికి ప్రశ్నపత్రాలు చేరాయనేది ప్రశ్నార్ధకంగా మారింది.
మరోవైపు గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలో 100కు పైగా మార్కులు సాధించిన అభ్యర్థులను రెండోసారి సిట్ పోలీసులు విచారిస్తున్నారు. 20 మంది అభ్యర్థులు సిట్ కార్యాలయానికి హాజరయ్యారు. విద్యార్హతలు, ప్రస్తుత ఉద్యోగం, పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకున్న కేంద్రాల వివరాలు సేకరించారు. 15 అంశాలతో కూడిన ప్రశ్నలను రూపొందించి వాటికి సమాధానాలను ఇవ్వాలని సిట్ పోలీసులు కోరారు. అవసరమైతే మళ్లీ విచారణ పిలుస్తామంటూ వివరించారు.
ఇవీ చదవండి: