TSPSC Paper Leakage Case Update : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో పేపర్ లీక్ వ్యవహారంలో అరెస్టుల పర్యం కొనసాగుతోంది. తాజాగా ఈ కేసులో మరో 19 మందిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. ఇప్పటివరకు అరెస్టు చేసిన వారి సంఖ్య 74కు చేరింది. పోల రమేశ్ ఏఈ ప్రశ్నాపత్రం ఇవ్వడం కోసం... ఒక్కొక్కరి వద్ద రెండు లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు వసూలు చేసినట్లు ఆధికారులు గుర్తించారు. ఈ మేరకు ఆధారాలు సేకరిస్తున్న అధికారులు.. నిందితులను అరెస్టు చేస్తున్నారు.
SIT Investigation in TSPSC Paper Leak Case : వరంగల్‌లో ఏఈగా పనిచేసిన పోల రమేశ్... కొద్దిరోజుల క్రితం హైటెక్ మాస్ కాపీయింగ్ వ్యవహారంలో అరెస్టు అయ్యాడు. అయితే అతను ఏఈఈ, డిఏఓ అభ్యర్థులతో ఒప్పందం కుదుర్చుకొని పరీక్ష కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ డివైజ్‌ల ద్వారా మాస్ కాపీయింగ్ చేయించాడు. ఇదే కాకుండా మరోవైపు ఇతని బంధువు, పేపర్ లీకేజీ కేసులో ప్రధాన నిందితుడు అయిన ప్రవీణ్ కుమార్‌కు స్నేహితుడైన సురేశ్ ద్వారా ఏఈ పరీక్ష పత్రాలు అందాయి.
వీటిని విక్రయించాలని సురేశ్ చెప్పడంతో తనకున్న పరిచయాలతో రమేశ్ వాటిని అభ్యర్థులతో పాటు మధ్యవర్తులకు కూడా విక్రయించాడు. వీటిని ఒక్కొక్కరికి ఒక్కో రేట్‌కి విక్రయించి రమేశ్ కోట్ల రూపాయలు సంపాదించాడని సిట్ పోలీసులు గుర్తించారు. పోల రమేశ్‌ను అరెస్టు చేసిన తర్వాత అతడి వద్ద లభించిన సమాచారం, బ్యాంకు ఖాతా వివరాలు, ఫోన్ కాల్ డేటా ఆధారంగా రమేశ్ వద్ద ఏఈ ప్రశ్నాపత్రం కొనుగోలు చేసిన వారందరినీ ఒక్కొక్కరిగా అరెస్టు చేస్తూ వచ్చారు.
అరెస్టుల సంఖ్య 100కి చేరే అవకాశం : ఇప్పటివరకు 30 మందికి పైగా అభ్యర్థులు, మధ్యవర్తులకు రమేశ్ ఏఈ ప్రశ్నాపత్రాన్ని విక్రయించినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే ఇతని వద్ద కొనుగోలు చేసిన మధ్యవర్తులు ద్వారా ఏఈ ప్రశ్నాపత్రం మరికొంతమందికి వెళ్లి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. తాజాగా అరెస్టు అయిన 19 మందిలో డి. శివకుమార్, ఎం. నాగరాజు, పి. సురేందర్, హరికృష్ణ, ధరావత్ రాజేష్, జెన్నాయుల అశోక్, ధరావత్ కళ్యాణ్, బానోత్ నాగరాజు, తోట విజయకుమార్, గడ్డం అజయ్ కుమార్, మాలోతు సునీల్, కోడి సంతోష్, మర్క రాములు సహా మరో ఆరుగురు ఉన్నారు. సిట్ అధికారుల దర్యాప్తులో మరికొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అరెస్టుల సంఖ్య కూడా 100కు పైగా ఉండొచ్చని సమాచారం.
ఇవీ చదవండి :