tspsc group1: రాష్ట్రంలో గ్రూపు-1 ఉద్యోగాల తొలి నోటిఫికేషన్ జారీకి సర్వం సిద్ధమైంది. నేడో రేపో ప్రకటన విడుదలకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు పూర్తి చేసింది. శనివారం ఇదే అంశంపై టీఎస్‌పీఎస్సీ కీలక సమావేశం జరిగింది. 19 ప్రభుత్వ శాఖల్లోని 503 ఖాళీల భర్తీపై అందిన ప్రతిపాదనలన్నింటినీ బోర్డు క్షుణ్నంగా పరిశీలించి ఆమోదం తెలిపింది. ఆయా పోస్టులకు విద్యార్హత, వయసు తదితర అంశాలను పరిశీలించి అన్నీ సక్రమంగా ఉన్నట్లు నిర్ధరించుకుంది. మరో మూడు అంశాలపై ప్రభుత్వం నుంచి ఆమోదం రావాల్సి ఉంది.
తేలాల్సిన అంశాలు
గతంలో గ్రూపు-1 కేటగిరీలో లేని విభాగాల పోస్టులను ఈసారి దాని పరిధిలోకి చేర్చారు. రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర కేడర్ పోస్టులు మల్టీజోనల్ స్థాయికి మారాయి. ఇంటర్వ్యూలు ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో గ్రూపు-1 పరీక్ష విధానంలో మార్పులు జరిగాయి. రాత పరీక్ష (900మార్కులు)లో ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంటుంది.
ఈ మూడు అంశాలపై ప్రభుత్వ నిర్ణయం వెలువడాల్సి ఉంది. వీటిపై ఆది లేదా సోమవారం ఉత్తర్వులొస్తాయని, రాగానే నోటిఫికేషన్ విడుదల చేయాలని టీఎస్‌పీఎస్సీ భావిస్తోంది. దరఖాస్తుల స్వీకరణకు ఎన్ని రోజులు సమయం ఇవ్వాలి, ప్రిలిమినరీ ఎప్పుడు జరపాలి వంటి అంశాలపై తాత్కాలిక టైంటేబుల్‌ను సిద్ధం చేసుకుంది.
అత్యధిక పోస్టులతో...
ఉమ్మడి రాష్ట్రంలో వెలువడిన వాటితో పోలిస్తే తెలంగాణ తొలి గ్రూపు-1 నోటిఫికేషన్ అత్యధిక పోస్టులతో వెలువడనుంది. టీఎస్‌పీఎస్సీ ఇప్పటికే సంబంధిత ముసాయిదాను సిద్ధం చేసుకుంది. జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు పెరగడంతో ఏకంగా 503 ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే జీవో జారీ చేసింది. ఇంటర్వ్యూలు లేనందున తొమ్మిది నెలల్లో ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు పూర్తిచేసి పోస్టింగ్‌లు ఇవ్వాలని కమిషన్ భావిస్తోంది.
ఇదీ చదవండి: హెల్మెట్ ధారణపై అడుగడుగునా చలాన్లు .. లబోదిబోమంటున్న వాహనదారులు