ఇంటి నుంచి తప్పిపోయిన ఓ బాలుడిని ఐదేండ్ల తర్వాత తల్లి ఒడికి చేర్చారు తెలంగాణ పోలీసులు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని అభివృద్ధి చేసిన 'దర్పన్' అప్లికేషన్‌తో ఇది సాధ్యమైంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్ జిల్లా హాండియా ప్రాంతానికి చెందిన శ్యాం సోని అనే బాలుడు 2015 జులై 14న ఇంటి నుంచి తప్పిపోయాడు.
అదే నెల 23న అసోంలోని గోలాపర్ పోలీసులకు బాలుడు దొరికాడు. బాలుడు వివరాలేమి చెప్పకపోవడం వల్ల గోలాపర్ పోలీసులు... బాలల సంరక్షణ కమిటీ సహకారంతో ఆశ్రమంలో ఉంచారు. రాష్ట్ర పోలీసులు దేశవ్యాప్తంగా తప్పిపోయిన చిన్నారుల ఆచూకీ గురించి తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో శ్యాం సోని ఫొటోను సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా పరిశీలిస్తుండగా ఉత్తరప్రదేశ్‌లో 5 ఏళ్ల క్రితం తప్పిపోయినట్లు గుర్తించారు.
వెంటనే ఆశ్రమంలో ఉన్న విషయాన్ని తెలంగాణ పోలీసులు.. హాండియా పోలీసులకు సమాచారం ఇచ్చారు. సదరు పోలీసులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి వెంటనే అసోం తీసుకెళ్లారు. ఐదేళ్ల క్రితం తప్పిపోయిన కుమారుడిని చూసి తల్లిదండ్రులు ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యారు. సంతోషాన్ని తట్టుకోలేక ఆనంద భాష్పాలు రాల్చారు. ముఖ కవళికల ఆధారంగా తప్పిపోయిన వాళ్లను గుర్తించే విధంగా తెలంగాణ పోలీసులు రూపొందించిన యాప్ ఎంతగానో ఉపయోగపడుతోంది.
డీజీపీ ప్రశంసలు
బాలుడిని తల్లిదండ్రుల చెంతకు చేర్చేందుకు మహిళా భద్రతా విభాగం చొరవను డీజీపీ మహేందర్ రెడ్డి ప్రశంసించారు. పిల్లాడికి తిరిగి తల్లిప్రేమను అందించారని కొనియాడారు.
ఇవీ చూడండి: యూట్యూబ్‌లో చూసి నేర్చుకుని లక్షలు వసూలు చేశారు...!!