ఉస్మానియా ఆస్పత్రి (Osmania Hospital) నిర్మాణంపై ఆరు వారాల్లో తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు (High court) ఆదేశించింది. ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణ వివాదంపై విచారణ జరిపిన ధర్మాసనం... ఆస్పత్రి నిర్మాణంపై ఏ నిర్ణయం తీసుకున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. భవనం కూల్చి కొత్తగా నిర్మిస్తారా? కొన్ని బ్లాకులే నిర్మిస్తారా... చెప్పాలని ఆదేశించింది.
ఇంకా ఎన్నేళ్లు కావాలి...
హెరిటేజ్ భవనం మినహా మిగతా బ్లాకుల్లో నిర్మించలేరా? అని అడిగింది. ప్రభుత్వం అన్ని అంశాలను పరిశీలిస్తోందని అడ్వొకేట్ జనరల్ ప్రసాద్ ఉన్నత న్యాయస్థానానికి తెలిపారు. నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం ఇవ్వాలని కోరారు. నిర్ణయం తీసుకోవడానికి ఇంకా ఎన్నేళ్లు కావాలని అసహనం వ్యక్తం చేసిన హైకోర్టు.. ప్రభుత్వం తీరు దురదృష్టకరమని వ్యాఖ్యానించింది.
6 వారాల గడువు..
ఆస్పత్రి సైట్ ప్లాన్, గూగుల్ మ్యాప్ ఎందుకు సమర్పించలేదని ఆగ్రహించింది. వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిపై ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోవద్దని అడగగా... వైద్యారోగ్య అధికారులు కరోనా నియంత్రణ చర్యలో ఉన్నారని ఏజీ తెలిపారు. కొంత సమయం ఇవ్వాలని కోరగా.. ఆస్పత్రి నిర్మాణంపై ఆరు వారాల్లో తుది నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.
ఆరేళ్లుగా నానుతోంది...
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉస్మానియా ఆసుపత్రి భవనం స్థానంలో ఆధునిక వసతులతో రెండు బహుళ అంతస్తుల భవనాలను నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించి ఆరేళ్లు గడిచినా.. ఆ దిశగా అడుగులు పడటంలేదు. వారసత్వ భవనంగా గుర్తింపు ఉండడంతో.. నూతన భవన నిర్మాణానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. తాజాగా ఉస్మానియా ఆస్పత్రిపై దాఖలైన వ్యాజ్యాలపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం... ఆస్పత్రిపై ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నారని ప్రశ్నించింది. సర్కారు వైఖరేంటో ఆరు వారాల్లోగా చెప్పాలని ఆదేశించింది.
ఇదీ చూడండి: Srinivas goud: ఒలంపిక్స్‌కు ఎంపికైన తెలంగాణ బిడ్డకు మంత్రి సన్మానం