ప్రభుత్వ ఉపాధ్యాయులు సుదీర్ఘకాలంగా కోరుతున్న బదిలీలు, పదోన్నతులపై ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. ఉపాధ్యాయుల స్పౌజ్ కేటగిరీ బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దంపతులను ఒకేచోటకు బదిలీ చేయాలని ఇటీవల టీచర్ల ఆందోళన చేపట్టారు. అయితే దీనిపై ప్రభుత్వం స్పందించి... దంపతుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో నిలిపివేసిన 12 జిల్లాల్లో దంపతుల బదిలీలు చేయాలని నిర్ణయించింది. సూర్యాపేట మినహా 12 జిల్లాల్లో 427 మంది టీచర్లను బదిలీ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది.
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ఈ నెల 27వ తేదీ నుంచి ప్రారంభం కానుండగా... 28 నుంచి 30వ తేదీ వరకు మూడు రోజులపాటు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు సోమవారం జరిగిన డీఈఓల సమావేశంలో కాలపట్టికను విద్యాశాఖ ఖరారు చేసింది. మొత్తం 37 రోజులపాటు ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఆ తర్వాత మళ్లీ 15 రోజులు అప్పీళ్లకు అవకాశం ఉంటుంది.
తొలిరోజు సీనియారిటీ జాబితాను ఆయా జిల్లాల్లో డీఈఓలు వెల్లడిస్తారు. ఫిబ్రవరి 14వ తేదీతో ప్రధానోపాధ్యాయుల బదిలీ ప్రక్రియ పూర్తవుతుంది. ఆ తర్వాత స్కూల్ అసిస్టెంట్లు.. చివరగా ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసే సెకండరీ గ్రేడ్ టీచర్లకు పదోన్నతులు, బదిలీలు నిర్వహిస్తారు. రాష్ట్రంలో 2015 జులైలో చివరిసారిగా పదోన్నతులు, బదిలీలు ఒకేసారి జరపగా.. మళ్లీ ఏడున్నర సంవత్సరాల తర్వాత ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. 2018లో కేవలం బదిలీలు మాత్రమే జరిగాయి. మొత్తం 9,700 మందికి పదోన్నతులు దక్కనున్నాయి. సుమారు 30 వేల మంది బదిలీ కానున్నారు.
ఇదీ 37 రోజుల కాలపట్టిక
- జనవరి 27న: అన్ని కేటగిరీల ఖాళీలు, ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతికి అర్హులైన స్కూల్ అసిస్టెంట్ల సీనియారిటీ జాబితాను ఆన్‌లైన్‌లో ప్రకటిస్తారు.
- జనవరి 28-30: బదిలీల కోసం అన్ని కేటగిరీల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల నుంచి దరఖాస్తుల స్వీకరణ.
- జనవరి 31-ఫిబ్రవరి 2: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన వారు పైఅధికారుల ధ్రువీకరణతో హార్డ్ కాపీలను సమర్పించాలి.
- ఫిబ్రవరి 7వ తేదీ: డీఈఓ, ఆర్‌జేడీ వెబ్‌సైట్లో బదిలీ పాయింట్లతో కూడిన తాత్కాలిక సీనియారిటీ జాబితా, పదోన్నతులకు సీనియారిటీ జాబితా ప్రకటన.
- ఫిబ్రవరి 8-10: అభ్యంతరాల స్వీకరణ, పరిశీలన, పరిష్కారం.
- ఫిబ్రవరి 11-12: బదిలీలు, పదోన్నతులకు తుది సీనియారిటీ జాబితా ప్రకటన. హెచ్‌ఎంలు బదిలీల కోసం వెబ్ ఆప్షన్ల నమోదు.
- 14వ తేదీ: ఆర్‌జేడీలచే ప్రధానోపాధ్యాయుల బదిలీ ఉత్తర్వుల జారీ.
స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు, బదిలీల అంకం ఇలా...
- 15వ తేదీ: హెచ్‌ఎంల బదిలీల అనంతరం మిగిలిన ప్రధానోపాధ్యాయ ఖాళీల ప్రకటన.
- 16-18 వరకు: అర్హత కలిగిన స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతుల కౌన్సెలింగ్.
- 19, 20 తేదీలు: సబ్జెక్టుల వారీగా స్కూల్ అసిస్టెంట్ల ఖాళీల ప్రకటన, బదిలీల ఆప్షన్ల నమోదు
- 21వ తేదీ: ఆప్షన్ల సవరణ, పునఃపరిశీలనకు అవకాశం.
- 22, 23 తేదీలు: డీఈఓలచే స్కూల్ అసిసెంట్ల బదిలీ ఉత్తర్వుల జారీ
సెకండరీ గ్రేడ్ టీచర్లకు పదోన్నతులు, బదిలీలు..
- 24వ తేదీ: స్కూల్ అసిస్టెంట్ల బదిలీల అనంతరం ఏర్పడిన ఖాళీల ప్రకటన.
- 25-27 వరకు: ఎస్‌జీటీ, తత్సమాన కేటగిరీ ఉపాధ్యాయులకు కోర్టు కేసులు లేని సబ్జెక్టుల్లో మాన్యువల్ కౌన్సెలింగ్ ద్వారా స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు.
- ఫిబ్రవరి 28- మార్చి 2వ తేదీ వరకు: ఎస్‌జీటీ, తత్సమాన పోస్టుల ఖాళీల ప్రకటన, వెబ్ ఆప్షన్ల నమోదు.
- మార్చి 3వ తేదీ: ఆప్షన్ల సవరణ, పునఃపరిశీలన.
- 4వ తేదీ: ఎస్‌జీటీ, తత్సమాన కేటగిరీ ఉపాధ్యాయులకు బదిలీ ఉత్తర్వులు విడుదల.
- మార్చి 5-19వ తేదీ వరకు: డీఈఓ ఇచ్చిన బదిలీ ఉత్తర్వులపై అప్పీళ్లు, అభ్యంతరాలను ఆర్‌జేడీకి.. ఆర్‌జేడీ ఉత్తర్వులపై అప్పీళ్లు, అభ్యంతరాలను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు పంపుకోవాలి. సంబంధిత అధికారులు 15 రోజుల్లో వాటిని పరిష్కరించాలి.