జేఈఈ మెయిన్‌లో ఇంటర్ మార్కుల వెయిటేజీని రెండేళ్ల క్రితమే తొలగించారు. ఈ క్రమంలో ఎంసెట్‌లో దీన్నెందుకు కొనసాగించాలనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. గతేడు ఎంసెట్ ఫలితాల విడుదల సందర్భంలో ఈ అంశాన్ని మీడియా ప్రస్తావించగా ‘నిపుణుల కమిటీని నియమించి నిర్ణయం తీసుకుంటామని’ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు.
కరోనా పరిస్థితుల కారణంగా ప్రస్తుతం ఆన్‌లైన్ బోధన కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు తక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉందని, వెయిటేజీ ఇస్తే కార్పొరేట్ విద్యార్థులే లబ్ధిపొందుతారని, కనీసం ఈ సంవత్సరానికైనా తొలగించాలనే ఆలోచనతో మండలి ఉన్నట్లు సమాచారం.
ప్రస్తుతం ఎంసెట్‌లో సున్నా మార్కులు వచ్చినా ఎస్‌సీ, ఎస్‌టీ విద్యార్థులకు ఇంటర్ మార్కుల ఆధారంగా ర్యాంకులు కేటాయిస్తున్నారు. వెయిటేజీ తొలగిస్తే అలాంటి వారు నష్టపోతారన్న అభిప్రాయమూ ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఇంటర్ వార్షిక పరీక్షలకు 70 శాతం సిలబస్ నుంచే ప్రశ్నలు ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించారు. ఎంసెట్‌కు కూడా దీన్నే వర్తింపజేస్తారా? లేదా జేఈఈ మెయిన్, నీట్ మాదిరిగా 100 శాతం సిలబస్ నుంచి ప్రశ్నలు ఇవ్వాలా? అనే అంశంపైనా సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
- ఇదీ చూడండి: 'విదేశాలకు బహుమతిగా 56 లక్షల డోసుల టీకా'