పట్టణాలైనా, గ్రామాలైనా భూముల్ని ఇళ్ల స్థలాలుగా మార్చి అమ్మాలంటే ముందుగా లేఅవుట్ చేసిన స్థలంలో 10శాతం స్థానిక సంస్థలకు రిజిస్ట్రేషన్ చేసి అప్పగించాలి. అలా ఇచ్చిన స్థలాన్ని పురపాలికలు ప్రజావసరాల కోసం వినియోగించాలి. అలాంటి ఖాళీ స్థలాలపై ప్రస్తుతం అక్రమార్కుల కన్ను పడింది. ఇప్పటికే స్థానిక సంస్థల పేరిట వదిలేసిన స్థలాలు, అక్రమ లే అవుట్లలో 10శాతం పేరిట చూపిన స్థలాలు, స్థానిక సంస్థలకు రిజిస్ట్రేషన్ చేసిన స్థలాన్ని అక్రమార్కులు ప్లాట్లు చేసి అమ్మేశారన్న అరోపణలున్నాయి. అలాంటి స్థలాల్ని ఎల్ఆర్ఎస్లో క్రమబద్దీకరించుకనేందుకు సైతం.. దరఖాస్తులు కూడా చేసినట్లు తెలుస్తోంది. మహబూబ్‌నగర్ జిల్లాలోని మహబూబ్ నగర్, భూత్పూరు, బాదేపల్లి మున్సిపాలిటీల్లో ఈ వ్యవహారం గుట్టు చప్పుడు కాకుండా జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నిర్లక్ష్యం వహిస్తోన్న మున్సిపాలటీలు
10శాతం ఖాళీ స్థలాల్ని కాపాడటంలో మున్సిపాలిటీలు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నాయి. మహబూబ్‌నగర్, బాదేపల్లి, భూత్పూర్ పురపాలికల్లో తాజా గణంకాల ప్రకారం 80 డీటీసీపీ లేవుట్లు, 1091 అనధికార లేఅవుట్లున్నాయి. అధికారిక డీటీసీపీ లేఅవుట్లలో 7.6 ఎకరాల ఖాళీ స్థలాల్ని పురపాలికలు స్వాధీనం చేసుకొని బోర్డులు పాతాల్సి ఉంది. కానీ నామమాత్రంగా కొన్నింటిలో మాత్రమే బోర్డులు పాతి కంచె లేకుండా వృథాగా వదిలేశారు. అనధికారిక లేఅవుట్లలో 10శాతం ఖాళీ స్థలాలు పురపాలికలు స్వాధీనం చేసుకొన్న దాఖలాలే లేవు. అనధికారిక లేఅవుట్ల లో ఇండ్ల స్థలాలు కొనుగోలు చేసిన యజమానుల నుంచి 14 శాతం అపరాధ రుసుం వసూలు చేసి వాటిని క్రమబద్దీకరిస్తున్న అధికారులు.. 10శాతం స్థలాల్ని మాత్రం పట్టించుకోవడం లేదు.
ఆక్రమణదారుల చెరలో
మహబూబ్‌నగర్‌లో 49 డీటీసీపీ లేఅవుట్లకు సంబంధించి 17 స్థలాలకు రక్షణ కంచెలు నిర్మించి బోర్డులు పాతలేదు. మిగిలిన స్థలాలకు కంచె వేసినట్లు రికార్డుల్లో చూపినా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. బాదేపల్లి, భూత్పూర్ పురపాలికల్లో అసలు వెంచర్లలో 10శాతం స్థలాల గుర్తింపు ప్రక్రియ జోలికి వెళ్లడం లేదు. దాదాపుగా ఈ రెండు పురపాలికల్లో ఖాళీ స్థలాలు ఆక్రమణదారుల చెరలో ఉన్నాయి
ఇప్పటికైనా డీటీసీపీ, మున్సిపాలిటీ అధికారులు స్పందించి 10శాతం ఖాళీ స్థలాన్ని ముందుగా గుర్తించి.. అక్రమార్కుల నుంచి వాటిని కాపాడాలని జనం విజ్ఞప్తి చేస్తున్నారు.
- ఇవీ చూడండి: 'తెలంగాణ మహిళా పోలీసులు దేశానికే ఆదర్శం'