గ్రామ పంచాయతీ కార్మికుల వేతనంపై దశలవారీగా ఆందోళనలు చేయాలని రాష్ట్ర పంచాయతీ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ నిర్ణయించింది. ఆ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు పి.గణపతి రెడ్డి అధ్యక్షతన ఆన్లైన్లో సమావేశం నిర్వహించారు. సకాలంలో వేతనాలు చెల్లించాలని కోరారు. జూన్ 15న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల వద్ద, జూన్ 19న మండల కేంద్రాల్లో, జూన్ 22న డీపీఓ ఆపీసుల వద్ద ధర్నాలు చేయాలని యూనియన్ నిర్ణయానికి వచ్చిందని పేర్కొన్నారు.
మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని అన్నారు. జీవో నంబర్ 51 సాకుతో కార్మికులను అక్రమంగా తొలగించడాన్ని మానుకోవాలని యూనియన్ సూచించింది. 60 ఏళ్లు పైబడిన వారిని పనుల్లో నిలుపుదల చేసి వారికి ఎలాంటి జీవనభృతి కల్పించకుండా ఇంటికి పంపించే చర్యలను విరమించుకోవాలని యూనియన్ విన్నవించింది. దశలవారీగా జరిగే ఆందోళన కార్యక్రమాల్లో గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులు అందరూ పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా యూనియన్ నేతలు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి : జుంబా డ్యాన్స్ పేరిట లైంగిక వేధింపులు