Congress Plan for TS Assembly Elections 2023 : ఇటీవల కర్ణాటకలో గెలుపుతో రాష్ట్ర కాంగ్రెస్ మంచి జోష్‌తో ఉంది. ఇదే ఊపులో తెలంగాణలోనూ అధికారంలోకి రావాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే 2023 ఎన్నికలపై దృష్టి సారించిన టీ-కాంగ్రెస్.. ఈసారి గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయించాలనే ఆలోచనతో ఉంది. జూనియర్, సీనియర్ అనే దాన్ని పట్టించుకోకుండా పార్టీ విజయ అవకాశాలను పరిగణనలోకి తీసుకుని మాత్రమే టికెట్లు కేటాయించాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే రానున్న ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇవ్వడం సాధ్యం కాదంటూ ఇప్పటికే కొందరు సీనియర్ నేతలకు చెప్పినట్లు సమాచారం. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనప్పటికీ.. పార్టీలో తగిన గౌరవం ఉంటుందని, అధికారంలోకి వచ్చిన తర్వాత అవకాశాలిస్తామని నచ్చజెబుతున్నట్లు తెలిసింది.
Telangana Assembly Elections 2023 : 'పార్టీలో కొందరు పెద్ద నేతలు ఉన్నప్పటికీ.. ఎన్నికల్లో వరుసగా ఓడిపోవడం, ఓట్ల తేడా కూడా చాలా ఎక్కువగా ఉంటోంది. ఆ నేతలు ఈ ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసినా ఇదే పరిస్థితి ఎదురువుతుంది. మరికొందరు నాయకులు ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే నియోజకవర్గాల్లో పర్యటించి.. ఆ తర్వాత కనిపించడం లేదు. ఇలాంటి వారికి మళ్లీ టికెట్ ఇచ్చినా పాత రిజల్టే వస్తుంది. మరికొన్ని చోట్ల ఇద్దరు బలమైన అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఆ ఇద్దరి మధ్య విబేధాలతో గత ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలను చవిచూడాల్సి వచ్చింది. ఇప్పుడు అలా కాకుండా ఆ ఇద్దరితో చర్చించి.. ఓ అవగాహనకు రావడం ద్వారా ఈ ఎన్నికల్లో విజయావకాశాలను మెరుగుపర్చుకోవాలని' చూస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. చాలా నియోజకవర్గాల్లో ఇప్పటికే ఇందుకు సంబంధించి కసరత్తును పూర్తి చేసినట్లు సమాచారం.
కొత్త వారికే 'ఛాన్స్' ఎక్కువ.. : ముఖ్యంగా ఈ ఎన్నికల్లో చాలా చోట్ల కొత్త అభ్యర్థులకే ప్రాధాన్యమిచ్చే ఆలోచనతో పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఉమ్మడి నిజామాబాద్, మహబూబ్ నగర్, వరంగల్, కరీంనగర్, నల్గొండ జిల్లాల్లో సమస్యలున్న నియోజకవర్గాలపై దృష్టి సారించినట్లు సమాచారం. పార్టీలోని ముఖ్య నాయకులకు ఉన్న అవగాహన, పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు నివేదికల ఆధారంగా ఎక్కడెక్కడ ప్రత్యామ్నాయం అవసరం అన్న దానిపై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నియోజక వర్గాల వారీగా తరచూ సర్వేలు చేయడం, అభ్యర్థి విషయమై ఓ నిర్ణయానికి రావడం, అక్కడ సీనియర్ నేతలుంటే వారు నొచ్చుకోకుండా నచ్చజెప్పడం.. ఇలా కసరత్తు జరుగుతోందని టీ-కాంగ్రెస్ వర్గాలు వివరించాయి.
ఇలా కొన్ని..
- కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ మల్లు రవి గతంలో జడ్చర్ల నుంచి పోటీ చేసి వరుసగా ఓడిపోయారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఎర్ర శేఖర్, అనిరుధ్ రెడ్డి పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. మల్లు రవికి ఈసారి టికెట్ ఇవ్వడం వీలుకాదని ఇప్పటికే చెప్పినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
- ఇక.. సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య 2014, 2018ల్లో జనగామ నుంచి వరుసగా 2 సార్లు ఓడిపోయారు. ప్రస్తుతం ఇక్కడ లక్ష్మయ్య-కొమ్మూరి ప్రతాప్ రెడ్డిల మధ్య పార్టీ టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో విజయావకాశాలు ఎక్కువగా ఉన్న వారికి టికెట్ ఇచ్చి.. మిగిలిన వారికి నచ్చజెప్పడం పార్టీ వ్యూహంగా ఉంది.
ఇవీ చూడండి..
Telangana 2023 Election: రాజుకున్న రాజకీయ వే'ఢీ '.. వ్యూహాలపై పార్టీల దృష్టి
T-Congress Focus on Joinings : పార్టీ బలోపేతంపై పీసీసీ ఫోకస్.. BRS, BJPలపై 'ఘర్ వాపసీ' అస్త్రం