రాష్ట్రంలో వరి సాగు, దిగుబడులు, కొనుగోళ్లల్లో సరికొత్త రికార్డు నమోదైందని పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. యాసంగి సీజన్‌లో లక్ష్యానికి మించి ధాన్యం సేకరించామన్నారు. 19 జిల్లాల్లో 100 శాతంపైగా కొనుగోళ్లు పూర్తయ్యాయని ఆయన తెలిపారు. హైదరాబాద్ ఎర్రమంజిల్ పౌరసరఫరాల భవన్‌లో ఆయన మాట్లాడారు.
భారత ఆహార సంస్థకు అప్పగించేందుకు నిర్దేశించుకున్న లక్ష్యాన్ని దాటి ఇప్పటి వరకు 82 లక్షల మెట్రిక్ టన్నులు.. 101 శాతం మేర కొనుగోలు చేశామని వివరించారు. పన్నెండున్నర లక్షల మంది రైతుల నుంచి 6 వేల 962 కొనుగోలు కేంద్రాల ద్వారా రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేశామని మారెడ్డి పేర్కొన్నారు. 16 వేల కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించామని... ఇంకా 3 నుంచి 4 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చే అవకాశం ఉందని మారెడ్డి వివరించారు.