TS Agros: రైతులతో మరింత మమేకమై సేవలందించేందుకు రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ- ఆగ్రోస్ అడుగులు వేస్తోంది. ఇప్పటికే బీఎస్సీ అగ్రికల్చర్ పట్టభద్రుల ద్వారా టీఎస్ ఆగ్రోస్ సేవా కేంద్రాలు నిర్వహిస్తోంది. నిర్వాహకులకు శిక్షణ ఇస్తూ అగ్రి డాక్టర్ హోదాకల్పించడం ద్వారా రైతులకుఎప్పటికప్పుడు కొత్త సాంకేతిక పరిజ్ఞానం చేరవేసే ప్రయత్నం చేస్తోంది. విత్తనం నుంచి పంటకోత, నూర్పిడి యంత్రాలు, ప్రొసెసింగ్ వరకు తమసేవా కేంద్రంలో లభించేలా అందుబాటులో ఉంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆగ్రోస్ సేవాకేంద్రాల్లో విత్తనాలు, రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు ఒకే చోట దొరకడంతో పాటు వారికి సలహాలు లభించడంతో మంచి ఆదరణ లభిస్తోందని నిర్వాహకులు చెబుతున్నారు.
సరసమైన ధరలు...
రాష్ట్రంలో ఇప్పటివరకు 1,016 ఆగ్రోస్ సేవా కేంద్రాలను మంజూరు చేసిన ప్రభుత్వం... నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పనిముట్లు... రైతులకు సరసమైన ధరలకు లభించేలా చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం వానాకాలం పంట ప్రణాళికకు అనుగుణంగా వ్యవసాయ ఉత్పత్తులు అందుబాటులో ఉంచేలా సన్నాహాలు చేస్తున్నామని టీఎస్ ఆగ్రోస్ సంస్థ ఎండీ రాములు వెల్లడించారు.
డ్రోన్ టెక్నాలజీ...
వ్యవసాయంలో ఐటీ, కృత్రిమ మేథ, బ్లాక్ చైన్ సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న వేళ.. డ్రోన్ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని ఆగ్రోస్ ఉవ్విళ్లూరుతోంది. కేంద్రాల నిర్వాహకులు ముందుకొస్తే రాయితీపై డ్రోన్లు ఇప్పించడంతోపాటు అవసరమైన శిక్షణ ఇస్తామని చెబుతోంది. ఇఫ్కోతోనూ ఆగ్రోస్ కీలక ఒప్పందం చేసుకుంది. నానో యూరియా వినియోగం పెరిగేలా కృషి చేస్తున్నామని ఇఫ్కో ప్రతినిధులు చెబుతున్నారు. టీఎస్ ఆగ్రోస్ సొంత సాంకేతికతతో అభివృద్ధి చేసిన సేంద్రీయ ఎరువు సిరిని... మరింతగా రైతుల్లోకి తీసుకెళ్లేలా ప్రణాళికలు రచిస్తోంది.
ఇదీ చదవండి:High Court On BJP MLA's: స్పీకర్‌ను కలవండి.. భాజపా ఎమ్మెల్యేలకు హైకోర్టు సూచన