ఆహార ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తోన్న భూమిని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కె.రాములు పేర్కొన్నారు. ప్రపంచ ధరిత్రి దినోత్సవం పురస్కరించుకుని నాంపల్లి టీఎస్-ఆగ్రోస్ సంస్థ నూతన కార్యాలయంలో ఆయన మాట్లాడారు.
కొవిడ్ నియంత్రణలో భౌతిక దూరం, ఔషధాలే కాక నాణ్యమైన ఆహారం సైతం అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని రాములు పేర్కొన్నారు. అలాంటి ఆహారాన్నిచ్చే భూమిని కాపాడుకోకపోతే మానవాళి అనారోగ్యం బారినపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులకు ప్రత్యామ్నాయంగా సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలని సూచించారు.
రసాయన ఎరువుల ధరలు పెరుగుతోన్న దృష్ట్యా.. యూరియా, డీఏపీ, భాస్వరం ఎరువులకు బదులుగా టీఎస్-ఆగ్రోస్ ఆధ్వర్యంలో విడుదల చేసిన 'తెలంగాణ సిరి' సేంద్రియ ఎరువులు వాడాలని కోరారు.
ఇదీ చూడండి: పర్యావరణాన్ని కాపాడుకునేందుకు అందరూ కృషి చేయాలి: కేసీఆర్