రాష్ట్రంలో జరగనున్న రెండు పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలకు తెలంగాణ రాష్ట్ర సమితి సన్నద్ధమవుతోంది. అధిష్ఠానం ఆదేశాల మేరకు ఆరు పూర్వ జిల్లాల పరిధిలో శనివారం నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ఆధ్వర్యంలో మండల స్థాయిలో ఎన్నికల సన్నాహక సమావేశాలు ప్రారంభమయ్యాయి. వరంగల్-నల్గొండ-ఖమ్మం జిల్లాల పట్టభద్ర నియోజకవర్గ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి(తెరాస), హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్ర నియోజకవర్గ ఎమ్మెల్సీ రామచంద్రరావు (భాజపా) పదవీ కాలం వచ్చే మార్చితో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం త్వరలో ఓటర్ల నమోదు షెడ్యూలును ప్రకటించనుంది.
గతంలో పాత జాబితాతో ఎన్నికలు నిర్వహించేవారు. తాజా నిబంధనల ప్రకారం ప్రతిసారి ఎన్నికలకు ముందు కొత్తగా ఓటర్ల నమోదు కార్యక్రమం జరుగుతోంది. సెప్టెంబరు నెల చివరి వారం లేదా అక్టోబరు మొదటి వారంలో ఓటర్ల నమోదుకు నోటిఫికేషన్ వస్తుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు స్థానాల్లోనూ గెలవాలని పార్టీ శ్రేణులను తెరాస సమాయత్తం చేస్తోంది.
కేటీఆర్ నేతృత్వంలో కార్యాచరణ
ఇటీవల జరిగిన తెరాస శాసనసభాపక్ష, ఎంపీల, మంత్రిమండలి సమావేశాల్లోనూ సీఎం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల గురించి ప్రస్తావించారు. దీనికి అనుగుణంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ కార్యాచరణ చేపట్టారు. మొత్తం ఆరు జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఇటీవల సమావేశాలు నిర్వహించారు. రెండు నియోజకవర్గాలలో పెద్దఎత్తున పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించాలని నిర్ణయించారు. మండలాల వారీగా పార్టీ నేతలకు బాధ్యతలను అప్పగించాలని కేటీఆర్ సూచించారు. దీనికి అనుగుణంగా ఆరు జిల్లాల్లో మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మండల స్థాయి సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేశారు. మంత్రి దయాకర్‌రావు, మరికొందరు వరంగల్ పూర్వ జిల్లాలో, మరో ఇద్దరు మంత్రులు జగదీశ్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్ నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో సమావేశాలు నిర్వహించారు.
హైదరాబాద్‌లో మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహమూద్‌అలీలు, మహబూబ్‌నగర్‌లో మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి.. రంగారెడ్డి జిల్లాలో మంత్రులు సబితారెడ్డి, మల్లారెడ్డి అంతర్గత సమావేశాలు జరిపారు. ఓటర్ల నమోదు ప్రారంభమైన వెంటనే రంగంలోకి దిగాలని సూచించారు. మిగిలిన ఎమ్మెల్యేలు ఆదివారం సమావేశాలు జరపనున్నారు. శాసనసభ సమావేశాల దృష్ట్యా సెలవు రోజుల్లోనే సమావేశాలు నిర్వహించాలని అధిష్ఠానం సూచించింది. ఓటర్ల నమోదు ప్రక్రియ ముగిసిన తర్వాత అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాలని పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. ఓటర్ల నమోదు ప్రక్రియకు వెంటనే ఆరు జిల్లాలకు, వాటి పరిధిలోని మండలాలకు ఇన్‌ఛార్జీలను నియమించాలని అధిష్ఠానం భావిస్తోంది.
ఇదీచూడండి.. కొత్త రెవెన్యూ చట్టాన్ని పకడ్బందీగా అమలుచేయాలి : కేసీఆర్