ఎల్ఐసీ ప్రైవేటీకరణతో కేంద్రం, సంస్థ ఉద్యోగులపై భారం పడుతుందని తెరాస పార్లమెంటరీ పక్ష నేత నామ నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. దీనిపై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుతాన్ని ఆయన కోరారు. భారీ లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేటీకరణ చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. 2019-20లో బీమా సంస్థకు సుమారు రూ. లక్షా 8వేల కోట్ల ఆదాయం లభించిందని తెలిపారు. ఇందులో కేంద్రం లాభం, పాలసీదారులకు చెల్లింపులు పోగా రూ.53,964 కోట్ల నగదు సంస్థ వద్ద ఉందని వివరించారు.
ప్రస్తుతం 1,13,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని నామ పేర్కొన్నారు. ఇప్పుడు వాటాల విక్రయంతో సంస్థకు నష్టం, ఉద్యోగ భయం ఉంటుందని పేర్కొన్నారు. ఈ అంశంపై సమాధానమివ్వాలని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ థాకూర్‌ను నామ కోరారు.
విస్తరణకు అవకాశం
నామ ప్రశ్నలపై కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ స్పందించారు. ప్రైవేటీకరణతో ఉద్యోగులకు, బీమా సంస్థకు నష్టం వాటిల్లదని పేర్కొన్నారు. పెట్టుబడుల ఉపసంహరణతో ఉద్యోగుల తొలగింపు ఉండబోదని సమాధానమిచ్చారు. వాటాల విక్రయం వల్ల అదనపు నిధుల లభ్యతతో పాటు.. సంస్థ విస్తరణకు అవకాశం ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఇదీ చదవండి: తాగు, సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి: తమిళిసై