కరోనా నియంత్రణకు తమ వంతు సహాయం అందించాలని నిర్ణయించిన్నట్లు తెరాస రాజ్యసభ, లోక్సభ పక్షనేతలు కె.కేశవరావు, నామ నాగేశ్వరరావు తెలిపారు. దిల్లీలో జరిగిన తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశంలో 16మంది లోక్సభ, రాజ్యసభ సభ్యుల రెండు నెలల వేతనాలను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వీటితో పాటు 16 కోట్ల రూపాయల ఎంపీ ల్యాడ్స్ నిధులను కూడా కరోనా నియంత్రణ కోసం కేటాయించారు.
జిల్లా కలెక్టర్ల ద్వారా కరోనా నియంత్రణ కోసం మందులు, ఇతర పరికరాల కొనుగోలుకు ఎంపీ ల్యాడ్స్ నిధుల ఖర్చు చేయనున్నట్లు ఎంపీలు తెలిపారు. ఉద్యమ స్ఫూర్తితో కరోనా నియంత్రణకు సీఎం కేసీఆర్ జరుపుతున్న పోరాటంలో ఎంపీలమంతా భాగస్వాములం అవుతామని చెప్పారు. సమర్థ నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తోన్న ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎంపీలు అభినందనలు తెలిపారు.