ప్రొఫెసర్ సాయిబాబాను ఉద్యోగం నుంచి తొలగించడాన్ని తెరాస పార్లమెంటరీ నేత కేశవరావు తప్పుబట్టారు. ఈ కేసు విచారణలో ఉండగానే ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన రాంలాల్ ఆనంద్ కాలేజీ సాయిబాబా సర్వీసులను రద్దు చేయడం సరికాదన్నారు. గతంలో కోర్టు కేసుల్లో నిర్దోషులుగా బయటపడి తమ ఉద్యోగాల్లో యథావిధిగా చేరిన ప్రొఫెసర్లు ఎంతోమంది ఉన్నారని కేశవ్‌రావు గుర్తు చేశారు.
ప్రొఫెసర్ సాయిబాబాను ఉద్యోగం నుంచి తొలగించడం మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని అభిప్రాయపడ్డారు. సాయిబాబా వైకల్యాన్ని దృష్టిలో ఉంచుకుని మానవతా దృక్పథంతో జైలు నుంచి విడుదల చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకి గతంలోనే తాను లేఖ రాసినట్లు వివరించారు. 90 శాతం వైకల్యంతో బాధపడుతున్న సాయిబాబాను ఇంకా జైల్లో ఉంచడం ఏ మాత్రం సమంజసం కాదని, తక్షణమే ఆయన్ను జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సాయిబాబాను ఉద్యోగం నుంచి తొలగిస్తూ తీసుకున్న నిర్ణయంపై రాంలాల్ ఆనంద్ కాలేజీ పునఃసమీక్షించుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి: అమ్మో పురుగులు... వంతెన దాటాలంటే వెన్నులో వణుకే.!