TRS Protest Over Paddy Procurement: ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా తెరాస నిరసనలు చేపట్టింది. పార్టీ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఆందోళనల్లో పాల్గొన్నారు. అన్ని జిల్లాలు, నియోజకవర్గాలు, మండలాల్లో నిరసనలతో హోరెత్తించారు. అబద్ధపు పునాదులపై భాజపా నాయకులు రాజకీయాలు చేస్తున్నారని ఆర్థికమంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కేంద్రప్రభుత్వ తీరుపై గజ్వేల్‌లో నిరసన తెలిపిన హరీశ్... భాజపా పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు పంటను ఎందుకు కొనడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
ధాన్యం కొనుగోలు చేయాలి...
రైతులు తలెత్తుకునేలా ముఖ్యమంత్రి కేసీఆర్... పథకాలు తీసుకొస్తుంటే కేంద్రం మాత్రం తెలంగాణపై కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని మంత్రి పువ్వాడ అజయ్ ఆరోపించారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో నిరసనలో పాల్గొన్నారు. మహబూబాబాద్‌లో మంత్రి సత్యవతి రాఠోడ్ నిరసనలో పాల్గొన్నారు. కేంద్రమే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మంత్రి డిమాండ్ చేశారు. పంజాబ్ నుంచి ధాన్యం కొంటున్న కేంద్ర సర్కారు... రాష్ట్రంలో ఎందుకు కొనడం లేదని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ నిలదీశారు. మహబూబ్‌నగర్‌లో నిరసన కార్యక్రమంలో పాల్గొన్న శ్రీనివాస్‌గౌడ్... ఉత్తర భారతదేశానికి ఒక న్యాయం? దక్షిణ భారతదేశానికి ఒక న్యాయమా? అని ప్రశ్నించారు.
నిరసన కార్యక్రమాలు...
మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండలం ఎదులాబాద్‌లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మంత్రి మల్లారెడ్డి నిరసన చేపట్టారు. ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంలో ఎన్డీఏ సర్కారు తీరు సరికాదన్నారు. నిర్మల్‌లో నిర్వహించిన నిరసనలో పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి... తెలంగాణ రైతులపై కేంద్ర ప్రభుత్వం వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని ఆరోపించారు. ధాన్యం సేకరణలో కేంద్రంలోని భాజపా వైఖరిపై ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, తెరాస నేతలు, అన్ని జిల్లాలు, నియోజకవర్గాలు, మండలాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఊరూరా చావు డప్పులు, ర్యాలీలతో నాయకులు ఆందోళనలు నిర్వహించారు.
ఇదీ చదవండి: Ministers Protest over paddy procurement : మోతెత్తిన చావుడప్పు.. కేంద్రం తీరుపై భగ్గుమన్న మంత్రులు