Minister harishrao comments: భారాసకు భయపడి భాజపా మునుగోడు ఉపఎన్నిక కుట్ర చేస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఎల్బీ నగర్ సాగర్ రింగ్ రోడ్డు సమీపంలో ఫంక్షన్ హాల్లో మర్రిగూడ గ్రామ ప్రజలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చి.. తెచ్చిన ఉపఎన్నిక ఇది అని భాజపాను విమర్శించారు. మునుగోడులో తెరాస గెలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో మునుగోడు మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.
ఎన్నికల తేదీ దగ్గర పడగానే బండి సంజయ్, రఘునందన్, ఈటెల రాజేందర్ ఆరోగ్యం బాగోలేదన్నారని.. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కూడా అలానే చేస్తారని హరీశ్‌రావు విమర్శించారు. అసలు భాజపా రాజకీయం అలాగే ఉంటుందని...చెయ్యి ఒరిగింది అని ఒకరు, కాలు ఇరిగింది అని ఒకరు, పాపం అనేలా చేసుకుంటారన్నారు. ఇలాంటివి నమ్మి మోసపోవద్దని ప్రజలకు తెలిపారు.
మర్రిగూడలో తెరాస ప్రభుత్వం రాకముందు భూమి ధర ఎకరం రూ. 50వేలు ఉండేది. కానీ తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత కోటి రూపాయలు అయ్యింది. ఇదే మనం కర్ణాటక పోతే ఈ ఎకరం అమ్మిన డబ్బుతో వంద ఎకరాలు కొనవచ్చు. రైతులకు ఉచిత బీమా, 24 గంటల కరెంట్ వచ్చింది. ఎన్నికలు దగ్గర పడగానే భాజపా నాయకత్వం ఆరోగ్యం బాగోలేదు అని ప్రజలను నమ్మించాలని చూస్తున్నాయి. శివన్నగూడెం చెరువులో నీళ్లు పోయించి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశాము. మునుగోడు ప్రజలు ఈ విషయాలను అర్థం చేసుకొని ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. - హరీశ్‌రావు, వైద్యారోగ్య శాఖ మంత్రి
మునుగోడు నుంచి వలస వచ్చిన వారు సొంత ఊరుకు పోయే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయన్నారు. శివన్నగూడెం చెరువులో నీళ్ళు పోయించి ఆ ప్రాంతం సస్యశ్యామలం చేస్తామన్న హరీష్ రావు...తెలంగాణ పథకాలు వల్ల భూమి విలువ ఎంతో పెరిగింన్నారు. తెలంగాణలో ఎకరం అమ్మితే కర్ణాటకలో వంద ఎకరాలు వస్తున్నాయని అన్నారు. మర్రిగూడ దిక్కు మర్రి చూడని రాజగోపాల్ రెడ్డికి మనం ఎందుకు ఓటు వేయాలని విమర్శించారు. భాజపా కు ఓటు వేసి మోస పోవద్దు.....గోస పడద్దు అని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి: