గులాబీ పార్టీ నేతల్లో శాసనమండలి పదవుల గుబులు నెలకొంది. పదవులు ఎవరికి దక్కుతాయోనని తెరాస నాయకుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. శాసన సభ్యుల కోటాలో ఎన్నికైన శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్, చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఆకుల లలిత, మహ్మద్ ఫరీదుద్దీన్ పదవీ కాలం జూన్ 3న ముగిసింది. గవర్నర్ కోటాలో నామినేట్ అయిన తెలంగాణ భవన్ ఇన్‌ఛార్జి, విశ్రాంత ప్రొఫెసర్ ఎం.శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్సీ పదవి కాలం కూడా జూన్ 16న ముగిసింది. ఆరు స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో. ఎవరికి దక్కుతాయోనని గులాబీ శ్రేణుల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. పదవిని కాపాడుకోవడానికి ఏడుగురు తాజా మాజీలు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు తమకు అవకాశం ఇవ్వాలని కొందరు నేతలు తెరాస నాయకత్వాన్ని కోరుతున్నారు.
తాజా మాజీ ఎమ్మెల్సీల్లో కొందరికి మరోసారి అవకాశం దక్కవచ్చనని పార్టీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మైనార్టీలకు ప్రాధాన్యతమిస్తున్న సంకేతాల కోసం ఫరీదుద్దీన్ కు మరోసారి అవకాశం ఇవ్వవచ్చని లేదా ఆయన స్థానంలో మరో మైనారిటీకి పదవి దక్కవచ్చునని భావిస్తున్నారు. డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యా సాగర్ కు ఇప్పటికే రెండుసార్లు అవకాశం ఇచ్చినందున.. మరోసారి కొనసాగిస్తారా? లేదా మరో నేతకు అవకాశం ఇస్తారా? అనే ఉత్కంఠ కొనసాగుతోంది. మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి మళ్లీ అవకాశం దక్క వచ్చునని లేదా? వచ్చే అసెంబ్లీ లేదా పార్లమెంటు ఎన్నికల్లో ఆయనకు అవకాశం ఇస్తామని మరొకరికి సర్దుబాటు చేయవచ్చునని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఆకుల లలితలు తమకు మళ్లీ ఎమ్మెల్సీ పదవి దక్కుతుందనే ఆశిస్తున్నారు.
శాసనమండలిలో అడుగుపెట్టేందుకు అవకాశం ఇవ్వాలని పలువురు నేతలు తెరాస నాయకత్వాన్ని కోరుతున్నారు. సీఎం కేసీఆర్, కేటీఆర్ ఇప్పటికే పలువురికి హామీ ఇచ్చినప్పటికీ.. వివిధ అంశాలను బేరీజు వేస్తున్నారు. పద్మశాలి, విశ్వబ్రాహ్మణ, కుమ్మరి, రజక వర్గాలకు కచ్చితంగా ఎమ్మెల్సీ పదవులు ఇస్తానని జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ పేర్కొన్నారు. తెదేపా నుంచి తెరాసలో చేరిన ఎల్.రమణకు ఎమ్మెల్సీ దాదాపు ఖాయమైనట్టేనని తెలుస్తోంది. మాజీ స్పీకర్ మధుసూదనచారికి ఇప్పటికే స్పష్టమైన హామీ ఇచ్చినట్లు సమాచారం. సీనియర్లకు, బీసీలకు, ఉద్యమకారులకు ప్రాధాన్యం ఇచ్చేందుకు మధుసూదనచారికి కచ్చితంగా ఎమ్మెల్సీ పదవి ఇవ్వొచ్చునని పార్టీ శ్రేణుల అంచనా. ఒకవేళ మధుసూదనచారికి అవకాశం ఇవ్వాలని భావిస్తే అదే జిల్లాకు చెందిన బోడకుంటి వెంకటేశ్వర్లుకు మరేదైనా పదవి ఇవ్వవచ్చునంటున్నారు.
నాగార్జునసాగర్ నియోజకవర్గం నేత ఎంసీ కోటిరెడ్డిని ఎమ్మెల్సీ చేస్తానని స్వయంగా కేసీఆర్ బహిరంగ సభలోనే ప్రకటించారు. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో సామాజిక వర్గం నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డిని ఒకవేళ కొనసాగిస్తే.. కోటిరెడ్డికి ఇప్పుడే అవకాశం ఇస్తారా లేదా వేచి చూడాల్సిందేనని పార్టీ నాయకుల విశ్లేషణ. జూన్ 16న పదవీ విరమణ చేసిన ఎం.శ్రీనివాస్ రెడ్డి మరోసారి పదవి ఆశిస్తున్నారు. అయితే శ్రీనివాస్ రెడ్డిని పూర్తిగా పార్టీ కార్యకలాపాల్లో వినియోగించుకోవచ్చునని పార్టీ నేతలు భావిస్తున్నారు. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, జూపల్లి కృష్ణారావు, మోత్కుపల్లి నర్సింహులు, పెద్దిరెడ్డి, సీతారాం నాయక్, తక్కళ్ళపల్లి రవీందర్ రావు, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, తదితరుల పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. గవర్నర్ వద్ద పెండింగులో ఉన్న కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్యే కోటాలో అవకాశం ఇచ్చి.. గవర్నర్ కోటాలో మరొకరి పేరును కూడా పంపించ వచ్చునని కూడా పార్టీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది. ఆశావహులు కేసీఆర్, కేటీఆర్‌లను ప్రసన్నం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కేటీఆర్ ఫ్రాన్స్ నుంచి రాగానే తుది కసరత్తు చేసి ఈ వారంలో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.
ఇదీ చూడండి: