Trs Leaders Fires on Kishan Reddy Comments: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బయ్యారంలో ఉక్కు కర్మాగారం నిర్మాణం సాధ్యం కాదన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రకటనను మంత్రులు తప్పుపట్టారు. విభజన చట్టం ప్రకారం బయ్యారానికి రావాల్సిన ఉక్కు పరిశ్రమ ఎందుకు ఇవ్వరని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రశ్నించారు. మేక్ ఇన్ ఇండియా నినాదంతో లక్షల కోట్లు వృథా చేస్తున్న కేంద్రం... బయ్యారం ఉక్కును పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కేంద్రమంత్రిగా కిషన్‌రెడ్డి తెలంగాణకు తెచ్చిన ఒక్క ప్రాజెక్టునైనా చూపించాలని పువ్వాడ అజయ్ కుమార్ డిమాండ్ చేశారు.
బయ్యారంలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పాలి: ప్రజల్లో తిరుగుబాటు రాకముందే బయ్యారంలో కేంద్ర ప్రభుత్వం ఉక్కు పరిశ్రమ నెలకొల్పాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ డిమాండ్ చేశారు. ఎంపీ మాలోతు కవిత, మాజీ మంత్రి రెడ్యానాయక్‌తో కలిసి ఆమె మాట్లాడారు. బయ్యారం ఉక్కు నాణ్యతపై ఉమ్మడి సర్వేకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇది కిషన్ రెడ్డి మాటనా? కేంద్ర ప్రభుత్వ వైఖరా ? స్పష్టం చేయాలని సత్యవతి రాఠోడ్ డిమాండ్ చేశారు.
కిషన్‌రెడ్డి ఉత్సవ విగ్రహంలా మారారని.. ప్రతీ విషయంలోనూ అవగాహ లేకుండా మాట్లాడుతున్నారని సత్యవతి రాఠోడ్ ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రిగా తెలంగాణకు ఉపయోగపడే ఒక్క పనైనా చేశారా అని ప్రశ్నించారు. తెలంగాణ పట్ల భాజపా వైఖరి మార్చుకోక పోతే ఆ పార్టీకి పుట్టగతులు ఉండవన్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ పెట్టమని కిషన్‌రెడ్డి ఎనిమిదేళ్ల తర్వాత చావు కబురు చల్లగా చెబుతున్నారని ఎంపీ మాలోతు కవిత విమర్శించారు.
తెలంగాణకు ఉత్సవ విగ్రహాలు అవసరం లేదు: తెలంగాణకు ఉత్సవ విగ్రహాలు అవసరం లేదని.. కిషన్‌రెడ్డి కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయాలని ఎంపీ మాలోతు కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ పట్ల భాజపాకు చిత్తశుద్ధి లేదని కిషన్‌రెడ్డి ప్రకటనతో రుజువైందన్నారు. కేంద్రమంత్రులు టూరిస్టుల్లా వచ్చి పోతున్నారు తప్ప తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. భాజాపాకు రాజకీయాలపై ఉన్న శ్రద్ధ ప్రజలకు మేలు చేయడంపై లేదని మాలోతు కవిత విమర్శించారు.
బయ్యారం ఉక్కు కర్మాగారం సాధించే వరకు పోరాటం ఆపేది లేదు: కేంద్ర ప్రభుత్వం వెంటనే పునర్విభజన చట్టం హామీలను అమలు చేసి బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి రెడ్యా నాయక్ డిమాండ్ చేశారు. బయ్యారం ఉక్కు కర్మాగారం సాధించే వరకు పోరాటం ఆపేది లేదని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ పేర్కొన్నారు. విభజన హమీలు నెరవేర్చుకోవడానికి ఓరుగల్లు నుంచే ఉద్యమాలు ప్రారంభిస్తామని వినయ్ భాస్కర్ ప్రకటించారు. విభజన చట్టంలోని హామీలు అమలుచేయనందుకు తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే రేగా కాంతారావు డిమాండ్ చేశారు.
"తెలంగాణ రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టునైనా తెచ్చారా. ఐటీఆర్, రైల్వేకోచ్ ఫ్యాక్టరీ పోగొట్టారు. గిరిజనయూనివర్సిటీకి దిక్కు లేదు. పునర్విభజన చట్టంలోని అనేక సమస్యలను పరిష్కరించలేదు. మీరు ఇదే మాట అప్పుడే చెబితే మేమన్నా ఫ్యాక్టరీ కట్టుకునేవాళ్లం. ఎనిమిది సంవత్సరాల తర్వాత కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి ఇప్పుడు బయ్యారం ఉక్కు పరిశ్రమ కాదు అని చెప్పడం మీ చేతకానితనానికి.. తెలంగాణ రాష్ట్రం పట్ల మీ వివక్షకు ఉదాహరణ." -పువ్వాడ అజయ్ కుమార్ మంత్రి
ఇవీ చదవండి: