రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభివృద్ధి, కష్టపడి ప్రజలకు సేవ చేసే వారికి ఓటు వేసి గెలిపించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ కేకే, ఎమ్మెల్యే దానం నాగేందర్ కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని.. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరిస్తోందని తెరాస నాయకులు విమర్శించారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో జలవిహార్‌లో నిర్వహించారు.
ప్రశ్నించే గొంతుకు ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నా భాజపా ఎమ్మెల్సీ రాంచందర్ రావు.. ఆరేళ్లుగా ఏ ఒక్కరోజు ప్రజా సమస్యలను పట్టించుకోలేదని వారు విమర్శించారు. అధికార పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపిస్తే... పట్టభద్రులకు అన్ని రకాలుగా మేలు జరుగుతుందన్నారు.
అపార రాజకీయ అనుభవం ఉన్న కుటుంబంలో నుంచి వచ్చిన తెలంగాణ బిడ్డగా తనను ఆదరించి... తనకు ఓటు వేసి గెలిపించాలని తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవి విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యలపై పోరాడేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని ఆమె పట్టభద్రులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి మహమూద్ అలీ, శ్రీనివాస్ యాదవ్, మండలి విఫ్ ప్రభాకర్ రావు, ఎమ్మెల్సీ భాను ప్రసాద్, పలువురు కార్పొరేటర్లు, ప్రవేటు కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.