TRS on Singareni: సింగరేణి ప్రైవేటీకరణకు కేంద్రంలోని భాజపా ప్రభుత్వం కుట్ర చేస్తోందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. సింగరేణికి బొగ్గు గనులు నేరుగా కేటాయించాలని కోరిన ఆయన... ఈ మేరకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి లేఖ రాశారు. సింగరేణి జోలికొస్తే కార్మికుల సెగ దిల్లీకి తాకుతుందని హెచ్చరించారు. ప్రభుత్వ సంస్థలను చంపేసే కుట్రకు భాజపా తెరలేపిందని.. సింగరేణిని బలహీనపరిచి, నష్టాల సంస్థగా మార్చే కుట్ర చేస్తోందన్నారు. నష్టాలు చూపి చివరకు ప్రైవేటుపరం చేయాలని భాజపా పన్నాగం పన్నుతోందని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి సింగరేణి అభివృద్ధి చెందుతోందని.. గనులు మూతపడే కొద్దీ ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఉంటుందని చెప్పారు. సింగరేణిలోని కేవలం 4 బ్లాకులను మాత్రమే కేంద్రం వేలం వేయడం లేదని, వేలాది మంది కార్మికుల భవిష్యత్తును బహిరంగ మార్కెట్లో వేలం వేస్తోందని విమర్శించారు. కేంద్రం మెడలు వంచిన రైతు పోరాటాన్ని మరిపించే మరో ఉద్యమానికి సింగరేణి కార్మికులు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.
కుట్రలు పన్నుతోంది..
సింగరేణిని ప్రైవేటీకరించేందుకు కేంద్రంలోని భాజపా సర్కార్ కుట్రలు పన్నుతోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. తెలంగాణపై కేంద్రం కక్షగట్టిందని.. ఎంత వేడుకున్నా కొంగుబంగారంలాంటి సింగరేణిలోని బొగ్గు గనుల వేలాన్ని ఆపటం లేదని విమర్శించారు. విశాఖ ఉక్కు కర్మాగారం మాదిరిగానే సింగరేణిపై భాజపా సర్కార్ కుట్రలు పన్నుతోందన్న సుమన్... దీనిని ఆదిలోనే అడ్డుకుంటామని తెలిపారు.
తెలంగాణపై కక్షగట్టడమే..
సింగరేణి ప్రైవేటీకరణను భాజపా నేతృత్వంలోని మోదీ సర్కారు ఆపకపోవడం దారుణం. ఇది తెలంగాణపై భాజపా ప్రభుత్వం కక్షగట్టడమే. రాబోయే రోజుల్లో అన్ని బొగ్గుగనులను ప్రైవేటుపరం చేస్తూ, ఉద్యోగాలను ఊడగొడుతూ మెల్లగా సంస్థను నష్టాల పాలుజేసి ప్రైవేటీకరణ చేసే కుట్రకు కేంద్ర ప్రభుత్వం తెరదీసింది. దీనిని ఆదిలోనే అడ్డుకోవాలనే నిర్ణయానికి తెరాస పార్టీ వచ్చింది. ఒకవేళ ఈ పద్ధతిని మార్చుకోకపోతే మరో పెద్ద ఉద్యమానికి తెరాస శ్రీకారం చుడుతుంది. మా పోరాటం గల్లీ నుంచి దిల్లీ వరకూ ఉంటుంది. జరగబోయే పరిణామాలకు కూడా తెరాస పార్టీది బాధ్యత కాదు.. కేంద్రంలోని భాజపా సర్కారుదే బాధ్యత.
-బాల్క సుమన్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే
సిద్ధమవుతున్న కార్మికులు
మరోవైపు కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ సింగరేణి కార్మికులు సైతం క్షేత్రస్థాయిలో ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. గత డిసెంబర్‌లో మూడ్రోజుల పాటు సమ్మెకు దిగగా... తాజాగా సంతకాల సేకరణతో నిరసన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: