భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎంపీగా ఉండి బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, తెరాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. సంజయ్ చట్టాలను ఉల్లంఘిస్తున్న దేశ ద్రోహి అని ధ్వజమెత్తారు. సవాల్ విసరాలనుకుంటే సంజయ్‌కి చార్మినార్ వద్ద ఆలయమే దొరికిందా.. వేరే దేవాలయాలు లేవా అని ప్రశ్నించారు.
భాజపా నేతలు మాట్లాడే తీరు వారి సంస్కృతికి అద్దం పడుతోందని పల్లా మండిపడ్డారు. వరద సాయం ఇవ్వకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. మరోవైపు గెలిస్తే ఇంటికి 25 వేల రూపాయలు ఇస్తామంటున్నారన్నారు. భాజపా నేతలు అసత్య ప్రచారాలు మానుకోవాలని సూచించారు.
చలాన్లను రద్దుచేస్తామని భాజపా నేతలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని.. చలాన్లను పెంచిందే కేంద్ర ప్రభుత్వమన్నారని పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోవాలని.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు.. భాజపాకు బుద్ధి చెప్పడం ఖాయమని పల్లా రాజేశ్వర్ రెడ్డి దీమావ్యక్తం చేశారు.
ఇవీచూడండి: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాజపా గెలవాల్సిన అవసరం ఉంది: పవన్ కల్యాణ్