హైదరాబాద్ మెట్రో రైలులో ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆర్టీసీతో ఇతర రవాణ వ్యవస్థలో తీసుకుంటున్న కరోనా జాగ్రత్తల కన్నా మెట్రోలో ఎక్కువ ఉన్నందున ప్రయాణికుల ఆదరణ పెరుగుతోంది. మరోవైపు మెట్రో ప్రయాణికులకు క్యాష్ బ్యాక్, ట్రిప్పుల తగ్గింపు నేపథ్యంలో అదనంగా ప్రయాణిస్తున్నారు. దేశంలో దిల్లీ తర్వాత హైదరాబాద్ మెట్రో రైళ్లలోనే ఎక్కువ సంఖ్యలో ప్రయాణిస్తున్నారు. ఇండియన్ మెట్రో ఆపరేటర్స్ గ్రూప్ సమాచారం ఆధారంగా శనివారం దేశంలో పలు రాష్ట్రాల్లో ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉంది.
మెట్రో స్టేషన్ | పొడవు(కి.మీ లలో) | స్టేషన్లు | రోజులో ప్రయాణికుల సంఖ్య |
దిల్లీ | 389 | 285 | 14,79,300 |
హైదరాబాద్ | 69 | 57 | 1,33,974 |
చెన్నై | 45 | 32 | 29,141 |
బెంగళూరు | 42 | 40 | 68,716 |
కొచ్చి | 26 | 23 | 11,106 |
నాగ్పూర్ | 25 | 16 | 4.051 |
లక్నో | 29 | 22 | 2,020 |
జైపూర్ | 12 | 11 | 20,160 |
ముంబై మెట్రో లైన్ వన్ | 11 | 12 | 32,322 |
ముంబై మోనో రైలు | 20 | 17 | 715 |
హైదరాబాద్ లో మొదట మూడు కారిడార్లలో దశల వారీగా ప్రారంభించి అన్ని కారిడార్లలో ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చారు. మొదట్లో కొద్ది రోజులు మూడు కారిడార్లలో కలిపి కేవలం 30 వేల మంది మాత్రమే ప్రయాణాలు చేశారు. ఆ తర్వాత క్రమేనా ఈ సంఖ్య పెరుగుతూ పోతోంది. ప్రస్తుతం రోజుకు సరాసరి లక్షా 30 వేలకు పైగా ప్రయాణిస్తున్నారు. నగరంలో బస్సుల్లో శానిటైజేషన్, సామాజిక దూరం అంతగా పాటించకపోవడం వల్ల ప్రయాణికులు మెట్రోను ఆశ్రయిస్తున్నారు.
బస్ ఛార్జీలతో పోలిస్తే మెట్రో ఛార్జీలు ఎక్కువే అయినా.. ఇటీవల ఆఫర్లు ప్రకటించగా రైళ్లలో ప్రయాణానికి జనాలు ఇష్టపడుతున్నారు. వీటితో పాటు మెట్రో స్టేషన్లలో కాంటాక్ట్ లెస్ టికెటింగ్, కరోనా నిబంధనలను పక్కాగా పాటిస్తున్నారు. కరోనాకు ముందు మెట్రోలో రోజుకు దాదాపు 4 లక్షల మంది ప్రయాణించేవారు. ఇప్పుడు ఎక్కువ శాతం మంది వర్క్ఫ్రంహోమ్ చేస్తున్నారు. వీరంతా మునుపటిలా కార్యాలయాలకు వెళ్లడం ప్రారంభిస్తే మెట్రోకు ప్రయాణికుల నుంచి మరింత ఆదరణ లభించనుంది.
ఇదీ చదవండిః రూ.900 కోట్ల ఆదాయం కోల్పోయాం: మెట్రో రైల్ ఎండీ