కేంద్ర ప్రభుత్వం ఈ నెల 17 వరకు లాక్‌డౌన్ ప్రకటించగా.. రాష్ట్రంలో మాత్రం ఈనెల 29 వరకు అమలులో ఉంటుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం సడలించింది. ఈ పరిస్థితుల్లో బస్సులు నడపాలా? లేదా? అన్నది ఈ నెల 15న సీఎంతో జరిగే కీలక సమీక్షలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
అన్నీ సింగల్ సీట్లే!
ఆర్టీసీ ఇప్పటివరకు ఎలాంటి విధాన నిర్ణయం తీసుకోనప్పటికీ నిరుపయోగంగా ఉన్న బస్సులతో కొందరు ప్రయోగాలు చేస్తున్నారు. సూపర్ లగ్జరీ బస్సులో మార్పులు చేశారు. 36 సీట్ల స్థానంలో 20 మాత్రమే ఏర్పాటు చేశారు. సాధారణంగా బస్సులో కుడి, ఎడమవైపున రెండేసి సీట్లు ఉంటాయి. ప్రయాణికుల రాకపోకలకు మధ్యలో ఖాళీ స్థలం ఉంటుంది. తాజా ప్రయోగంలో కుడి, ఎడమల వైపు ఒక్కో సీటును మాత్రమే ఏర్పాటు చేశారు. ప్రయాణికులు నడిచే మార్గంలో కూడా ఒక్కో సీటును అమర్చారు. దీంతో మధ్యలో నడిచేందుకు మరీ సౌకర్యంగా ఉన్నట్లు కనిపించడంలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో బస్సులు నడిపేందుకు ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలన్న దానిపై అధికారులు యోచిస్తున్నారు. సీట్లలో మార్పులు చేయాలా? పరిమిత సంఖ్యలో ప్రయాణికులను ఎక్కించాలా? ఎన్ని సర్వీసులను నడపాలన్న అంశాలపై మంతనాలు జరిపి ఒక విధానాన్ని రూపొందించే పనిలో ఉన్నట్లు ఉన్నతాధికారి చెప్పారు.