Special Story on Ponds in Hyderabad : హైదరాబాద్ నగరంలోని చెరువులు కంపుకొడుతున్నాయి. తీవ్రమైన దుర్గంధం వెదజల్లుతున్నాయి. ఫలితంగా స్థానికులకు గాలి పీల్చడం కూడా కష్టంగా మారుతోంది. పెరిగిన ఉష్ణోగ్రతల నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు చెరువు వద్ద ఆగితే.. అక్కడ ఊపిరి ఆగిపోయే దుస్థితి నెలకొంటోంది.
Ponds Stink In Hyderabad Areas : చెరువుల చుట్టూ ఉన్న జనావాసాల నుంచి విడుదలయ్యే మరుగుదొడ్ల వ్యర్థాలతో చెరువులు నిండిపోతున్నా.. మురుగును దారి మళ్లించే ఏర్పాట్లను జలమండలి నత్తనడకన కొనసాగిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మురుగు నీటి మళ్లింపు, చెరువుల ఆక్రమణ, పూడికతీత వంటి కార్యక్రమాలను సకాలంలో చేయడంపై జీహెచ్‌ఎంసీ, జలమండలి అధికారుల మధ్య సమన్వయం ఉండట్లేదని నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భరించలేనంతగా బంజారా లేక్: బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 1లోని తాజ్ బంజారా లేక్(గుళ్ల చెరువు)లో కలిసే వరద కాలువ మురుగు నల్లగా మారి.. అదే ప్రాంతంలో వ్యర్థాలు, బురద పేరుకుపోయాయి. దీంతో వర్షాకాలంలో నీటి ప్రవాహానికి ఆటంకం తలెత్తి అంబేడ్కర్‌నగర్ బస్తీ నీట మునుగుతోంది. ఇక్కడ దుర్వాసనతో పాటు దోమల బెడద కూడా విపరీతమైంది. చెరువు పరిసర ప్రాంత ప్రజలు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. జీహెచ్‌ఎంసీ అధికారులు కాలనీల్లో ఇంటింటి చెత్త సేకరణను నిర్లక్ష్యం చేయడంతో అదంతా తటాకంలోకి చేరుతోంది.
చర్యలు తప్పనిసరి..: మురికి వ్యర్థాలుగా మారుతున్న చెరువులకు జీవం పోసే చర్యలు వెంటనే మొదలవ్వాలని పర్యావరణవేత్తలు స్పష్టం చేస్తున్నారు. మురుగు నీటిని దారి మళ్లించి.. ఆ చెరువుల్లో చేపల పెంపకం మొదలు పెట్టాలని సూచిస్తున్నారు. లేదంటే గ్రేటర్ పరిధిలోని 185 చెరువులు దుర్భరంగా మారుతాయని హెచ్చరిస్తున్నారు.
ఎక్కడెక్కడ ఎలా..
- సరూర్‌నగర్ చెరువును సుందరీకరించడంతో అక్కడికి సందర్శకులు పెరిగారు. అయినా గానీ అక్కడికెళ్లిన ప్రతి ఒక్కరూ ముక్కు మూసుకోవాల్సిందే. ఆ నీటిలో బోటింగ్ చేసేవారు ఊపిరి పీల్చుకోలేకపోతున్నారు. ఉక్కిరిబిక్కరి అవుతున్నారు.
- ఫిల్మ్‌నగర్, షేక్‌పేట మధ్యనున్న ఎర్రకుంట మురుగు వ్యర్థాలతో నిండిపోయింది. పూడిక తీయక అలానే పేరుకుపోయి లోతు తగ్గింది. ఫిల్మ్‌నగర్‌లోని కొన్ని కాలనీల మురుగు, బుల్కాపూర్ నాలా వ్యర్థాలతో తటాకం దుర్గంధభరితమైంది.
- కూకట్‌పల్లిలోని బాలాపూర్ పెద్దచెరువు, నాగోల్ అయ్యప్పకాలనీ చెరువు, ఐడీఎల్ చెరువు, మల్కాజిగిరి బండ చెరువు, సఫిల్‌గూడ చెరువు, బోరబండ సున్నం చెరువు, మీరాలం ట్యాంకు, గోల్కొండ చెరువు, ఇతరత్రా జల వనరులు మురికి కూపాలుగా మారాయి. పరిశ్రమలు, జనవాసాల నుంచి వెలువడే వ్యర్థాలు తటాకాల్లో చేరుతున్నాయి. తద్వారా చెరువుల్లో గ్రీన్ ఆల్గే, గుర్రపుడెక్క విస్తరిస్తున్నాయి.
ఇవీ చదవండి: