తెలంగాణ ప్రభుత్వం కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా ఈవీ పాలసీని తీసుకువచ్చిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్(Puvvada) తెలిపారు. కొనుగోలు దారులకు ప్రోత్సహాకాలు కూడా ప్రకటించిందని చెప్పారు. ఖైరతాబాద్‌లోని రవాణా శాఖ కార్యాలయంలో ప్యాసింజర్ ఎలక్ట్రికల్ ఆటోను ప్రారంభించిన మంత్రి కొద్దిసేపు ఆటోను సరదాగా నడిపారు. వాహనాల పికప్ బాగా ఉందని కితాబునిచ్చారు.
రిజిస్ట్రేషన్ ఫీజు, క్వార్టర్లీ ఫీజును మాఫీ చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఈవీ పాలసీలో 264 కోట్ల భారం పడినప్పటికీ వాయు కాలుష్యం తగ్గించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆలోచన చేసిందని మంత్రి వివరించారు. హైదరాబాద్ నగరంలో 5వేల ఎలక్ట్రికల్ ఆటోలకు అనుమతి ఇచ్చామని... ప్రస్తుతం 26 ప్యాసింజర్ ఆటోలు రిజిస్ట్రేషన్ అయ్యాయని మంత్రి పేర్కొన్నారు.
ఏ ఆటో అయినా సరే రోజుకు వంద కిలోమీటర్ల కంటే ఎక్కువ తిరగలేదు. ఎలక్ట్రికల్ ఆటోలు కూడా అంతే తిరుగుతాయి. వాటి ఛార్జింగ్ పాయింట్స్ ఏర్పాటుకు ప్రణాళిక తయారు చేశాం. కంపెనీలు కూడా ఛార్జింగ్ పాయింట్స్ ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నాయి. పెట్రోలు బంక్స్ లాగానే ఛార్జింగ్ పాయింట్స్ ఏర్పాటు చేయాలి. ఎలక్ట్రికల్ ఆటోను ఇంటి దగ్గర ఛార్జ్ చేసుకుంటే 100 నుంచి 110 కిలోమీటర్లు నడుస్తుంది. రవాణా శాఖ తరఫున కూడా ఛార్జింగ్ పాయింట్స్ ఏర్పాటు చేస్తాం
-పువ్వాడ అజయ్ కుమార్, రవాణా శాఖ మంత్రి
Puvvada: కాలుష్యాన్ని తగ్గించడానికి ఈవీ పాలసీ తీసుకొచ్చాం
ఇదీ చదవండి: కాంగ్రెస్ గూటికి కీలక నేతలు.. రేవంత్‌రెడ్డితో భేటీ