హైదరాబాద్ కోఠిలోని ఆరోగ్య కార్యాలయంలో కొనసాగుతున్న కొవిడ్ టీకాల పంపిణీ శిక్షణ కార్యక్రమంలో మంగళవారం వైద్యఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ పాల్గొని వైద్యసిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు, ఇతర ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
పది వేల కేంద్రాల్లో టీకాలు
రాష్ట్రంలో తొలివిడతలో సుమారు 75 లక్షల మందికి కొవిడ్ టీకా అందజేసే అవకాశం ఉంది. ఇందులో సుమారు 3 లక్షల మంది ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యసిబ్బంది ఉంటారు. సుమారు 2 లక్షల మంది పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, రవాణా సిబ్బందికీ టీకాలిస్తారు. మిగిలిన వారిలో దాదాపు 60 లక్షల మందికి పైగా 50ఏళ్లు పైబడిన వారు ఉంటారని అంచనా. వీరు కాకుండా 50 ఏళ్లలోపు దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్నవారికీ టీకా అందజేయనున్నారు.
ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యసిబ్బంది సమాచారం ఇప్పటికే కొవిన్ యాప్‌లో పొందుపర్చగా.. ఇతర కేటగిరీల సమాచారాన్ని సేకరించడంలో నిమగ్నమయ్యారు. దీంతోపాటు స్వచ్ఛందంగా కూడా ఆయా కేటగిరీల వ్యక్తులు టీకా కోసం కొవిన్ యాప్‌లో సమాచారాన్ని పొందుపర్చేందుకు అవకాశం కల్పిస్తారు. టీకాలు రాష్ట్రానికి చేరగానే.. తొలుత ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సిబ్బందికి ఇవ్వాలని నిర్ణయించారు. వీరందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు టీకాలివ్వాలని ప్రణాళిక రూపొందించారు.
ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యసిబ్బందికి కూడా ప్రభుత్వ బృందాల ఆధ్వర్యంలోనే టీకాలిస్తారు. కొవిడ్ టీకా వేయడానికి మొత్తం 10 వేల బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో బృందం ఒక్కో కొవిడ్ కేంద్రంలో టీకాలను అందజేస్తుంది. ఇందుకోసం 10వేల మంది ఏఎన్‌ఎంలకు, 25వేల మంది ఆశా ఆరోగ్య కార్యకర్తలకు, 15వేల మంది వైద్యులు, నర్సులకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నారు. ఈ నెలాఖరులోగా శిక్షణ కార్యక్రమాలను పూర్తి చేసుకొని, టీకాలు అందించడానికి సర్వసన్నద్ధంగా ఉండాలని వైద్యకార్యదర్శి ఆదేశాలు జారీచేశారు.
టీకాల నిల్వకు ప్రత్యేక ఏర్పాట్లు
ప్రస్తుతం ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో టీకాల నిల్వ కేంద్రాలుండగా వీటితో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లోనూ కొవిడ్ టీకాలను భద్రపర్చడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో 2 కోట్ల టీకాలను, జిల్లాల్లో కోటి టీకాలను ఏకకాలంలో భద్రపర్చేలా సన్నాహాలు చేస్తున్నారు. టీకాలను సరఫరా చేసేందుకు ప్రత్యేక వాహనాలను సమకూర్చుకుంటున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో టీకాల సరఫరాకు 16 వాహనాలు అందుబాటులో ఉండగా మరో 17 వాహనాలను కొనుగోలు చేయడానికి ఆదేశాలిచ్చారు. సమాచారాన్ని పొందుపర్చడంలో ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన మానవ వనరులను స్థానికంగానే నియమించుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతమున్న టీకా నిల్వ పరికరాల్లో ఇబ్బందులుంటే సత్వరమే మరమ్మతులు చేయించి అందుబాటులోకి తీసుకురావాలని జిల్లాల వైద్యాధికారులకు సూచించారు.
ఇదీ చదవండి: నాలుగైదు వారాల్లో కరోనా టీకా: ప్రజారోగ్యశాఖ డైరెక్టర్