Tollywood Actress Dimple Hayathi Controversy : హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కారును ఢీ కొట్టిన కేసులో టాలీవుడ్ నటి డింపుల్ హయాతిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై తాజాగా డీసీపీ హెగ్డే వివరణ ఇచ్చారు. డింపుల్ హయాతి, తాను ఒకే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నామని.. సెల్లార్‌లో తన కారుకు అడ్డంగా ఆమె కారు పెడుతోందని ఆరోపించారు. తాను అత్యవసరంగా బయటకు వెళ్లేటప్పుడు ఇబ్బంది అవుతోందని.. ఈ విషయంలో వ్యక్తిగతంగా వెళ్లి డింపుల్ హయాతిని తను రిక్వెస్ట్ చేసినా ఫలితం లేకపోయిందన్నారు.
ఈ క్రమంలోనే అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో నిలిపి ఉంచిన తన కారును ఢీకొట్టి, కాలితో తన్నారన్న ఆయన.. ప్రభుత్వ కారును ధ్వంసం చేసినందుకు తన డ్రైవర్ జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడని వివరించారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని తాను తప్పును కప్పి పుచ్చినట్లు డింపుల్ ట్వీట్ చేశారన్న హెగ్డే.. ఆమె ఆరోపణలపై వాస్తవం దర్యాప్తులో బయట పడుతుందని స్పష్టం చేశారు.
''డింపుల్ హయాతి, నేను ఒకే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాం. సెల్లార్‌లో నా కారుకు అడ్డంగా ఆమె కారు పెడుతోంది. నేను అత్యవసరంగా వెళ్లేటప్పుడు నాకు ఇబ్బంది అవుతోంది. ఈ విషయంలో వ్యక్తిగతంగా వెళ్లి డింపుల్ హయాతిని రిక్వెస్ట్ చేశాను. సెల్లార్‌లో నా కారును ఢీ కొట్టి, కాలితో తన్నారు. ప్రభుత్వ కారును ధ్వంసం చేసినందుకు మా డ్రైవర్ ఫిర్యాదు చేశాడు. నేను అధికారం అడ్డం పెట్టుకొని తప్పు కప్పిపుచ్చినట్లు డింపుల్ ట్వీట్ చేశారు. డింపుల్ ఆరోపణలపై వాస్తవం దర్యాప్తులో బయట పడుతుంది.'' - రాహుల్ హెగ్డే, హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ
ఇదీ అసలు విషయం..: జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలోని హుడా ఎంక్లేవ్‌లో హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే నివాసం ఉంటున్నారు. అదే అపార్ట్‌మెంట్‌లో హీరోయిన్ డింపుల్ హయాతి, డేవిడ్‌లు ఉంటున్నారు. డీసీపీకి చెందిన ప్రభుత్వ వాహనాన్ని.. ఆయనకు డ్రైవర్‌గా ఉన్న కానిస్టేబుల్ చేతన్ కుమార్.. సెల్లార్‌లో పార్కింగ్ చేస్తారు. ఆ వాహనం పక్కనే నటి హయాతి, డేవిడ్‌లు తమ కార్లను పార్కింగ్ చేస్తారు. ఈ క్రమంలో డీసీపీ వాహనానికి ఉన్న కవర్‌ను తొలగించడం, అడ్డుగా డింపుల్ కారును నిలపడం వంటివి చేస్తున్నారంటూ.. రాహల్ హెగ్డే ఆరోపించారు. ఈ నెల 14న డింపుల్ హయాతి కారుతో తన వాహనాన్ని ఢీకొట్టిందన్నారు. ఈ ఘటనలో పార్కింగ్ చేసి ఉన్న తన కారు ముందు భాగం దెబ్బ తినిందని డీసీపీ వెల్లడించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా విషయం తెలుసుకున్న డ్రైవర్ చేతన్ కుమార్.. జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారని వివరించారు.
ఇవీ చూడండి..
Dimple Hayathi Case : ఐపీఎస్ అధికారితో హీరోయిన్ గొడవ 'రామబాణం' స్టార్‌పై క్రిమినల్ కేసు!