ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర వైఖరికి నిరసనగా నియోజకవర్గ కేంద్రాల్లో ఈ నెల 12న(TRS Dharna) ధర్నాకు తెరాస పిలుపునిచ్చిన నేపథ్యంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో దృష్ట్యా ధర్నాల కోసం కలెక్టర్ల నుంచి అనుమతి తీసుకోవాలన్నారు. కలెక్టర్ల అనుమతితోనే ధర్నాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు వివరించారు. కలెక్టర్ల అనుమతితో ధర్నాలు నిర్వహించి విజయవంతం చేయాలని కేటీఆర్ గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
రైతులకు సంఘీభావంగా తెరాస ఈ నెల 12న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద ధర్నా(TRS Dharna) నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ధర్నా చౌక్‌ను మంత్రులు తలసాని, మహమూద్ అలీ పరిశీలించారు. వారి వెంట ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, వెంకటేశ్వర్లు, దానం నాగేందర్ ఉన్నారు.
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర వైఖరికి నిరసనగా ధర్నా(TRS Dharna) నిర్వహిస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. రాష్ట్ర భాజపా నేతలు వరి పండించాలని చెబుతున్నారని.. కానీ ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్రం చెబుతోందని మండిపడ్డారు. దేశంలో పంజాబ్ తర్వాత అత్యధికంగా తెలంగాణలోనే వరి పండిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచే వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన చేస్తుందని మంత్రులు(TRS Dharna) స్పష్టం చేశారు.
సాగుచట్టాలతో రైతులను కేంద్రం ఇబ్బంది పెడుతోంది.. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతోంది. భాజపా నాయకులది రెండు నాలుకల ధోరణి. కేంద్రం నిర్ణయాలపై దేశవ్యాప్తంగా ఉన్న విపక్షాల మద్దతు తీసుకుంటాం. పార్లమెంట్ సమావేశాలు ఎలా జరుగుతాయో చూస్తాం.
-తలసాని శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి
ధాన్యం కొనుగోళ్లు, వరిసాగు అంశాలపై కొద్దిరోజులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం తలెత్తింది. ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్రం చెప్పిందని తెరాస చెబుతుండగా.. అలాంటిదేమీ లేదని భాజపా నేతలు చెబుతున్నారు. బండి సంజయ్ ఆరోపణలను ఖండిస్తూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రెస్‌మీట్ పెట్టి కేంద్రం తీరుపై మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్ల బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న కేంద్ర ప్రభుత్వం .. రైతుల దగ్గర రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు యత్నిస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం, భాజపా తీరుకు నిరసనగా.. ధాన్యం కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో ఈనెల 12న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు చేస్తామన్నారు. ఈ పిలుపులో భాగంగా కేటీఆర్ సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు.
ఇదీ చదవండి: GHMC funds news: బల్దియా నిధులకు రాష్ట్రం ఎగనామం