Mallu Ravi fires on BJP and TRS: టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. భవిష్యత్‌లో అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్ పార్టీయే అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాహుల్‌గాంధీ పాదయాత్ర విజయవంతంగా సాగిందన్న మల్లు రవి... దేశ వ్యాప్తంగా భారత్ జోడోయాత్రకు మంచి ఆదరణ లభిస్తుందని వెల్లడించారు.
రాష్ట్రంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన జోడోయాత్రకు సహకరించిన కార్యకర్తలు, పార్టీ అభిమానులకు మల్లు రవి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అంతే కాకుండా మునుగోడు ఉపఎన్నిక ఫలితంపై స్పందిస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశ చరిత్రలో మద్యం, డబ్బు ఏరులై పారిన ఎన్నికగా మునుగోడు ఉపఎన్నిక నిలుస్తుందని ఆరోపించారు. అధికారం, అంగబలంతో తెరాస, భాజపాలు కుళ్లు రాజకీయాలు చేశాయని వ్యాఖ్యానించారు.
'భవిష్యత్తులో అధికారం కాంగ్రెస్ పార్టీదే. జోడోయాత్రను ప్రజలు విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే రాహుల్ యాత్ర చేపట్టారు. తెలంగాణలో అన్ని వర్గాల సమస్యలు రాహుల్ తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రజలు చైతన్య వంతులు, పోరాట పటిమ కలవారు. తెరాస, భాజపా కలిసి డబ్బుతో మాయ చేశారు. కాంగ్రెస్ మాత్రమే ప్రజల తరఫున యుద్ధం చేసింది. మునుగోడు ఎన్నిక అవినీతి ఎన్నికగా దేశచరిత్రలో నిలిచిపోతుంది.'-మల్లు రవి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు
దేశ ప్రజలు కోల్పోయిన స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకే రాహుల్ గాంధీ జోడోయాత్ర చేపట్టారని మల్లు రవి పేర్కొన్నారు. తెలంగాణలో పాదయాత్ర సాగుతున్న సమయంలో రైతులు, చేనేత కార్మికులు, కళాకారులు, మేధావులు, సామాజికవేత్తలు ఇలా అన్ని వర్గాల వారితో రాహుల్ మాట్లాడి వాళ్ల సమస్యలు తెలుసుకున్నారని రవి తెలిపారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా... రాజ్యాంగ వ్యతిరేక పాలన సాగిస్తున్నారని భాజపాపై మండిపడ్డారు.
మునుగోడులో రాజ్యాంగ పరమైన ఎన్నిక జరగలేదు: ప్రజలకు అన్యాయం జరిగితే పోరాటం చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని మల్లు రవి పేర్కొన్నారు. అధికారంతో సంబంధం లేకుండా ప్రభుత్వంపై ప్రజా సమస్యల పట్ల కొట్లాడుతున్నామన్నారు. మునుగోడులో మూడో స్థానంలో నిలిచినంత మాత్రాన పార్టీ పనైపోయిందనుకుంటే పొరపడినట్లే అవుతుందన్నారు. అక్కడ ప్రజాస్వామ్యయుత ఎన్నికలు జరిగాయా లేదా అనేది మునుగోడు ప్రజలను అడిగితే తెలుస్తుందని వ్యాఖ్యానించారు. తెరాస, భాజపా కలిసి డబ్బుతో జనాలను మాయ చేశారని ఆరోపించారు. మునుగోడులో రాజ్యాంగ పరమైన ఎన్నిక జరగలేదని మండిపడ్డారు. ఓట్ల కోసం తమ నాయకులనూ కొనుగోలు చేశారని ధ్వజమెత్తారు.
ఇవీ చదవండి: