Mahesh Kumar Goud on Congress Senior Leaders: పార్టీలో ప్రజాస్వామ్యం ఉందని హద్దుమీరి వ్యవహరిస్తే అధిష్ఠానం చూస్తూ ఉరుకోదని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. అసమ్మతి నేతల తీరుతో పార్టీకి నష్టం కలిగితే వారే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ మేరకు మహేష్ గౌడ్ వ్యాఖ్యలు చేశారు.
జగ్గారెడ్డికి విజ్ఞప్తి
పార్టీలో ఏ నేత అయినా బాహాటంగా మాట్లాడటం సరికాదని మహేష్ హితవు పలికారు. సవాళ్లు అనేవి ప్రతిపక్ష నేతలపై విసరాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డిని విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. మంత్రి హరీశ్ రావును వీహెచ్ కలిసిన అంశం కూడా అధిష్ఠానం పరిశీలిస్తోందని పేర్కొన్నారు. ఆదివారం జరిగిన సీనియర్ల సమావేశం గురించి ఏఐసీసీకి నివేదించినట్లు వెల్లడించారు. ప్రతి పార్టీలో కోవర్ట్ వ్యవస్థ ఉంటుందని.. తమ పార్టీలో కూడా ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.
బాహాటంగా వద్దు
"కాంగ్రెస్ పార్టీలో జగ్గారెడ్డి సీనియర్ నేత. ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనను ఎంతో గౌరవిస్తాం. కానీ పార్టీలో కొన్ని అంతర్గత విషయాలు ఇలా బాహాటంగా మాట్లాడటం సరికాదు. సవాళ్లు అనేవి ప్రతిపక్ష నేతలకు విసరాలి కానీ.. మనం మనమే ఛాలెంజ్ చేసుకోవద్దు. టీపీసీసీలో ఏ నిర్ణయమైనా.. అది అధిష్ఠానం తీసుకున్నదే. అధిష్ఠానం ఆదేశాలను మేం అనుసరిస్తాం." -మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్
ద్వంద్వ వైఖరి
ధాన్యం విషయంలో తెరాస ద్వంద వైఖరిని అవలంభిస్తోందని మహేష్ గౌడ్ విమర్శించారు. ధాన్యం కొనుగోలు విషయంలో తెరాస, భాజపాలు రైతులను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. రైస్ మిల్లర్లతో కుమ్మక్కయ్యాయని.. అందుకే కరీంనగర్‌లో రైస్ మిల్లర్ల ఒత్తిడితో అధికార పార్టీ ఐకేపీ సెంటర్లను మూసివేయించిందని మండిపడ్డారు.
ఇదీ చదవండి: కేంద్రం ధాన్యం సేకరించే వరకు విశ్రమించే ప్రసక్తే లేదు: సీఎం కేసీఆర్