రాష్ట్రంలో జర్నలిస్టులను ఫ్రంట్లైన్ వారియర్లుగా గుర్తించి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా నిలవాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు అందరికీ వ్యాక్సినేషన్ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. తెరాస ఏడేళ్ల పాలనలో తెలంగాణ ఆగమైందని ఆరోపించారు. తెరాస ప్రభుత్వం అన్ని రకాలుగా విఫలమైందని విమర్శించారు. మొదటి లాక్‌డౌన్ నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాను తీవ్రంగా పరిగణనలోకి తీసుకోలేదని ఆరోపించారు. ఈ విషయాలను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. పక్క రాష్ట్రాలు ఉచితంగా కొవిడ్ చికిత్సను అందిస్తుంటే... ఇక్కడ మాత్రం అది లేదని విమర్శించారు. అన్ని మండల కేంద్రాల్లో ఆర్టీపీసీఆర్ టెస్టులను ఉచితంగా చేయాలని డిమాండ్ చేశారు. తెరాస సర్కారును అన్ని జిల్లాల్లోని కాంగ్రెస్ శ్రేణులు నిలదీయాలని సూచించారు.
సోనియా ఏ ఉద్దేశంతో రాష్ట్రాన్ని ఇచ్చారో.. అది నెరవేరడం లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందని... ధనిక రాష్ట్రంగా వున్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని ధ్వజమెత్తారు. డీపీఆర్లు లేకుండా ప్రాజెక్టులు కట్టి.. వేల కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. కరోనా బాధితులను పట్టించుకునే నాథుడే లేడని, బ్లాక్ ఫంగస్ వస్తే మందులు కూడా లేవని విమర్శించారు.
ఇదీ చదవండి: DGP: లాక్‌డౌన్, కర్ఫ్యూ ఉల్లంఘనలపై 2.61లక్షల కేసులు