మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు(PCC Chief) రేవంత్ రెడ్డి(Revanth Reddy) భేటీ అయ్యారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలంగాణ మంచి కోసం పరితపిస్తుంటారని రేవంత్ రెడ్డి అన్నారు. ఆయనతో రాజకీయపరమైన అంశాల కంటే.. అభివృద్ధి అంశాల మీదనే చర్చించామని తెలిపారు. నిరుద్యోగం, కృష్ణా జలాల విషయంలో జరుగుతున్న పరిణామాలపై చర్చించామని చెప్పారు. తెలంగాణను సీఎం కేసీఆర్ భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణను... అప్పుల రాష్ట్రంగా మార్చారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం వేల కోట్ల రూపాయలు సంపాదించిందని ఆరోపించారు. అప్పుల కోసం... కేసీఆర్ ఎక్కడో పోవాల్సిన అవసరం లేదని.. కేటీఆర్, సంతోష్‌ను అడిగితే పది పైసల వడ్డీకే వేల కోట్లు ఇస్తారని ఎద్దేవా చేశారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. కాంగ్రెస్‌కు రాజీనామా చేసినా ఐడియాలజీకి చేయలేదన్నారు. కొండా.. కాంగ్రెస్‌లోకి ఎప్పుడైనా రావొచ్చని చెప్పారు.
'భవిష్యత్ కార్యాచరణపై కొండా విశ్వేశ్వర్ రెడ్డికి నిర్ధిష్టమైన ఆలోచన ఉంది. వారి లక్ష్యం నాకు స్పష్టంగా తెలుసు. ఆ లక్ష్యాన్ని సాధించడంలో మేం కలిసికట్టుగా పని చేయాలని అనుకుంటున్నాం. రాష్ట్రంలో రాచరికం నడుస్తోంది. ఇదీ ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఆనాడు రాచరిక పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ రైతంగా సాయుధపోరాటం జరిగింది. ఎన్నికలు చాలా దూరంలో ఉన్నాయి. ఎన్నికలపై చర్చించలేదు. కేవలం తెలంగాణ సమస్యలపై చర్చించాం.'
-రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు కావాలని కాంగ్రెస్ లోపల, బయట మస్తుగా కొట్లాడినట్లు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. తానే స్వయంగా వెళ్లి కలుద్దామని అనుకున్నానని.... ఆయనే వస్తానని చెప్పి కలిశారని పేర్కొన్నారు. తాము ఇద్దరం... రాష్ట్ర పరిణామాలపై చర్చించామన్నారు. కాంగ్రెస్ చేపట్టబోయే నిరుద్యోగ దీక్షలో పాల్గొంటాని చెప్పారు. తెలంగాణ ఆకాంక్షలతో ఎవరు ఏ పోరాటం చేసినా తాను మద్దతిస్తానని కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ చేస్తే మరింత సంతోషిస్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చేరాలనేది త్వరలో చెబుతానని చెప్పారు.
'రైతుల సమస్యలపై చర్చించాం. కాంగ్రెస్‌లో చేరే విషయమై ఆలోచిస్తున్నా. ఇప్పటికైతే ఏం నిర్ణయం తీసుకోలేదు. కేసీఆర్‌తో కొట్లాడే వ్యక్తి రేవంత్ రెడ్డి ఒక్కరే.. కాంగ్రెస్ బలపడితే తెలంగాణకు మంచి జరుగుతుంది. రాజకీయాల్లో తెలంగాణ 70 ఏళ్లు వెనకపడింది.'
-కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ ఎంపీ
ఇదీ చదవండి: వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువ పెంపునకు రంగం సిద్ధం