Revanth Reddy on Assam cm : అసోం సీఎం హిమంత బిశ్వశర్మ... కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపైన చేసిన అనుచిత వ్యాఖ్యలు సభ్యసమాజం సిగ్గుపడేలా ఉన్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మాతృత్వాన్ని కించపరిచేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు అసోం సీఎం వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు ప్రకటించారు. ఆయనను సీఎం పదవి నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ, కేంద్రహోం మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా ఇప్పటివరకు దీనిపై స్పందించకపోవడం దారుణమన్నారు. గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మెంబర్షిప్ సమీక్షలో పాల్గొన్న రేవంత్... ఈ సందర్భంగా మాట్లాడారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు
రాహుల్ గాంధీపై హిమంత బిశ్వశర్మ వాఖ్యలను నిరసిస్తూ... రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. రేపు తెలంగాణలోని అన్ని పోలీస్ స్టేషన్లలో బిశ్వంత్ శర్మపై ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపిన రేవంత్ రెడ్డి.... సీఎం కేసీఆర్ మాటల్లో చిత్తశుద్ధి ఉంటే అసోం సీఎంపై కేసులు నమోదు చేయించాలని డిమాండ్ చేశారు.
డిజిటల్ మెంబర్షిప్లో దేశంలోనే తెలంగాణ కాంగ్రెస్ ముందంజలో ఉంది. 33 లక్షల మంది సభ్యులను సాధించాం. ఇది టీ కాంగ్రెస్ టీమ్ వర్క్ సాధించిన విజయం. ఈ సందర్భాన్ని వేడుకలా చేయాలని భావించినప్పటికీ అసోం సీఎం ... రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాం. అసోం సీఎంపై జూబ్లీహిల్స్ పీఎస్‌లో నేను ఫిర్యాదు చేస్తా. రాజకీయాల్లో విధానాల పరంగా విమర్శించాలి. భాష జుగుప్సాకరంగా, అసహ్యంగా ఉండకూడదు. సీఎం హిమంత బిశ్వశర్మను వెంటనే బర్తరఫ్ చేయాలి.
-రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇంఛార్జి మాణికం ఠాగూర్, వర్కింగ్ ప్రెసిడెంట్స్ గీతారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, ఏఐసీసీ కార్యక్రమాల ఛైర్మన్ మహేశ్వర్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, శ్రీనివాస్ కృష్ణన్, చిన్నారెడ్డి సహా పలువురు నేతలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ప్రధాని మోదీ వ్యాఖ్యలను.. కేసీఆర్ ఎందుకు ఖండించలేదు?: రేవంత్