Ambedkar memorial in Hyderabad: భాగ్యనగరంలోని ఎన్టీఆర్ మార్గ్‌లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ స్మృతివనాన్ని నెల రోజుల్లో పూర్తిస్థాయిలో ప్రారంభించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అక్కడ ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహం 125 అడుగుల ఎత్తు ఉండగా దీని పీఠం 50 అడుగుల ఎత్తులో ఉంది. పీఠం లోపలి భాగంలో 30 అడుగుల హాలును ఏర్పాటు చేశారు. ఒకేసారి వందమంది కూర్చోడానికి వీలుగా ఆ థియేటర్‌ను తీర్చిదిద్దారు.
Ambedkar Statue in Hyderabad : ఇక్కడ రోజూ అంబేడ్కర్ జీవితచరిత్ర మీద చలన చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. సంబంధిత వివరాలను బీబీసీ టీవీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ తదితర అనేక సంస్థల నుంచి సేకరించనున్నట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అదేవిధంగా అక్కడ మిగిలిన హాలులో బాబాసాహెబ్ అంబేడ్కర్ చిన్ననాటి నుంచి కీలక బాధ్యతల్లో ఉన్నప్పటి వరకు ఉన్న అరుదైన ఫొటోల ఎగ్జిబిషన్ రూపొందిస్తున్నారు. మరో 20 రోజుల్లో పీఠం కింది భాగంలో హాలు నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఆర్‌అండ్‌బీ అధికారి వెల్లడించారు.
హుస్సేన్ సాగర్ తీరాన దాదాపు 11 ఎకరాల విస్తీర్ణంలో ఈ స్మృతివనం ఉంది. అందులో మూడెకరాలను సందర్శకుల పార్కింగ్ కోసం అధికారులు కేటాయించారు. మిగిలిన భాగంలో ల్యాండ్ స్కేపింగ్ పనులు చేయాల్సి ఉందని సంబంధిత అధికారులు తెలిపారు. మే మధ్య నుంచిగానీ వచ్చే నెలాఖరు నుంచి ఈ కేంద్రంలోకి అధికారికంగా పర్యాటకులను అనుమతించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ స్మృతివనంలోకి వచ్చే వారికి టికెట్ పెట్టాలా, ఉచితంగానే అనుమతించాలా అన్న విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
దేశానికే దిక్సూచిలా.. సమానత్వ స్ఫూర్తిని నిత్యం రగిలించేలా హుస్సేన్ సాగర్ తీరాన ఏప్రిల్ 14న హక్కుల సారథి, బహుముఖ ప్రజ్ఞాశాలి, బాబా సాహెబ్ అంబేడ్కర్... అంబర చుంభిత విగ్రహం ఆవిష్కృతమైన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 125 అడుగుల అంబేడ్కర్ మహా విగ్రహాన్ని... ఆయన మనవడు ప్రకాశ్ అంబేడ్కర్‌తో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో తరలివచ్చిన జన సందోహం జయజయ ధ్వానాల మధ్య... బౌద్ధ సంప్రదాయం ప్రకారం హెలిక్యాప్టర్ నుంచి పూలవర్షం కురుస్తుండగా భారత రాజ్యాంగ నిర్మాత విగ్రహావిష్కరణ జరిగింది. హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోనూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం నమోదు అయ్యింది.
ఇవీ చదవండి: