ప్రభుత్వ నిబంధనల మేరకు కందులను మిల్లింగ్ చేసి, పప్పు అందించడం సాధ్యం కాదని మిల్లర్లు ముందుకు రావట్లేదు. ఆహారభద్రత కార్డు ఉన్న వారందరికీ ఉచితంగా నెలకు కిలో చొప్పున మూడు నెలలపాటు కందిపప్పు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
తెలంగాణలో 87.55 లక్షల ఆహార భద్రతా కార్డులు ఉన్నాయి. వాటిలో కేంద్రం జారీ చేసినవి సుమారు 53.21 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినవి 34.34 లక్షల కార్డులు. నెలకు కిలో చొప్పున సుమారు 8,700 టన్నుల కందిపప్పు అవసరం. జాతీయ ఆహార భద్రత కార్డులు ఉన్న వారికి మాత్రమే కేంద్రం కందిపప్పు ఇస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తాను జారీ చేసిన కార్డులకు కూడా పప్పు ఇవ్వాలని నిర్ణయించింది.
నాఫెడ్ అతి కష్టం మీద మే నెలకు సుమారు ఆరు వేల టన్నుల పప్పును అందించగా, 21 జిల్లాల్లో మాత్రమే సరఫరా చేయగలిగారు. గత నెలలో అసలు ఇవ్వలేదు. ఈ నెలలో కూడా పూర్తిగా ఇవ్వలేని పరిస్థితి. 17,509 టన్నుల కందుల మిల్లింగ్ కోసం వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసి ఈ నెల 13న టెక్నికల్ బిడ్లను పరిశీలించింది. 20వ తేదీలోగా పప్పు సరఫరా చేయాలని కోరటంతో, ఆచరణ సాధ్యం కాదని మిల్లర్లు తిరస్కరించారు.