రాష్ట్రంలో మొదటి పురపాలక ఎన్నికలకు సర్వం సన్నద్ధమైంది. తొమ్మిది నగరపాలకసంస్థలు, 120 పురపాలక సంస్థల్లో రేపు పోలింగ్ జరగనుంది. కార్పొరేషన్లలో 325 డివిజన్లకు గానూ ఒక వార్డు ఇప్పటికే ఏకగ్రీవమైంది. మున్సిపాలిటీల్లో 2,727 వార్డులకు 80 ఏకగ్రీవమయ్యాయి. ఓటింగ్ కోసం నగరపాలక సంస్థల్లో 1,438, పురపాలక సంస్థల్లో 6,188 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కరీంనగర్ కార్పొరేషన్‌తో కలిపితే రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 53,55,942. ఇందులో పురుషులు 26,81,591 కాగా... మహిళలు 26,73,994. ఇతరులు 357 మంది ఉన్నారు.
45 వేల మంది సిబ్బంది
కరీంనగర్ కార్పొరేషన్లో పోలింగ్ ఈ నెల 24న జరగనుంది. అక్కడ రెండు లక్షల 72వేలకు పైగా ఓటర్లున్నారు. బుధవారం జరగనున్న పోలింగ్‌లో 50 లక్షలకు పైగా ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ విధుల కోసం దాదాపు 45 వేల మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. ఓటింగ్ దృష్ట్యా ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో ఇప్పటికే స్థానికంగా సెలవు ప్రకటించారు. కర్మాగారాలు, కంపెనీల్లో వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని కార్మిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పురపాలక ప్రాంతాల్లో నివసిస్తూ ఇతర చోట్ల ఉద్యోగాలు చేస్తున్న వారు ఓటుహక్కు వినియోగించుకునేందుకు వీలుగా మూడు గంటల పాటు సమయం ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఆయా సంస్థలు, కంపెనీల యాజమాన్యాలను ఆదేశించింది. పోలింగ్ కోసం అవసరమైన ఏర్పాట్లను అధికార యంత్రాంగం పూర్తి చేస్తోంది.
వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ
నేటి సాయంత్రానికల్లా సిబ్బంది, ఎన్నికల సామగ్రి ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,355 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్‌ను పర్యవేక్షించనున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి అనుసంధానించి పోలింగ్ తీరుతెన్నులను పరిశీలిస్తారు. మిగతా పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియను వీడియోగ్రఫి చేస్తారు. ఓటర్ల గుర్తింపు కోసం మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా కొంపల్లి పురపాలికలోని పది పోలింగ్ కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా ఫేషియల్ రికగ్నైజేషన్ విధానాన్ని అమలు చేయనున్నారు.
పోటీలో 12,898 మంది అభ్యర్థులు
రేపు ఓటింగ్ జరగనున్న 3,052 వార్డుల్లో 12,898 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పార్టీల వారీగా చూస్తే తెరాస తరఫున 2,972 మంది పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ తరఫున 2,616 మంది, భాజపా నుంచి 2,313 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. తెలుగుదేశం అభ్యర్థులు 347 మంది, మజ్లిస్ అభ్యర్థులు 276 మంది పోటీలో ఉన్నారు. సీపీఐ నుంచి 177, సీపీఎం నుంచి 166 మంది పురపోరులో నిలిచారు. ఇతర పార్టీల వారు 282 మంది ఎన్నికల్లో పోటీ చేస్తుండగా... 3,749 మంది స్వతంత్రులు ఎన్నికల బరిలో ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని డబీర్ పురా డివిజన్ ఉపఎన్నికకు కూడా రేపే పోలింగ్ జరగనుంది. ఇక్కడ ఆరుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
ఇవీ చూడండి: రైతుబంధుకు రూ.5100 కోట్లు మంజూరు