రాష్ట్ర భాజపా నేతలు ఇవాళ దిల్లీకి పయనమయ్యారు. పార్టీ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశం అక్కడ జరగనున్న దృష్ట్యా పార్టీ నేతలు వెళ్లనున్నారు. పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా, కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఈ సమావేశంలో పాల్గోనున్నారు.
పార్టీ బలోపేతంపై చర్చ
తెలంగాణలో రాజకీయంగా పార్టీ బలోపేతం కావడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌తో రాష్ట్ర నేతలు ఓ హోటల్‌లో సమావేశమయ్యారు. పార్టీ బలోపేతానికి కాంగ్రెస్, తెదేపా నేతలను చేర్చుకోవడంపై వ్యూహరచన చేసినట్లు సమాచారం.
మున్సిపల్ ఎన్నికల్లో గెలుపుపై వ్యూహ రచన
కొద్దిరోజులుగా ఆయా పార్టీల నేతలతో జరుపుతున్న సంప్రదింపులు, ఎవరెవరు పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారనే అంశంపై మాట్లాడారు. ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలతో సంప్రదింపులు జరిపేందుకు రాంమాధవ్ హైదరాబాద్‌కు వచ్చినట్లు సమాచారం. ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికల అంశం కూడా చర్చకు వచ్చింది. పార్టీకి పట్టున్న ప్రాంతాలపైనే దృష్టి పెట్టాలని వీరు నిర్ణయించినట్లు సమాచారం.
ఇవీ చూడండి: సచివాలయం తరలింపునకు ప్రణాళిక సిద్ధం