పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం నేడు ప్రారంభం కానుంది. తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం కొమరగిరి గ్రామంలో ఈ పథకానికి ఏపీ సీఎం శ్రీకారం చుట్టనున్నారు. కోర్టు వివాదాలు ఉన్న ప్రాంతాలు మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రక్రియ అమలు కానుంది. రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో ఇళ్ల స్థలాల పంపిణీ కోసం వేర్వేరు తేదీలను ప్రభుత్వం నిర్ణయించింది. కోస్తా జిల్లాల్లో ఇవాళ, రాయలసీమకు సంబంధించి ఈనెల 28న చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో, ఉత్తరాంధ్రకు ఈనెల 30న విజయనగరంలో సీఎం చేతుల మీదుగా పంపిణీ ప్రారంభించనున్నారు. అనంతరం 15 రోజుల పాటు.. మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ఇళ్ల పట్టాలు అందజేస్తారు.
30.75 లక్షల మంది లబ్ధిదారులు....
మొత్తం 30.75 లక్షల మంది లబ్ధిదారులకు ఉచిత ఇళ్ల పట్టాలు సహా టిడ్కో ఇళ్లు, క్రమబద్ధీకరించిన ఆక్రమిత స్థలాల పట్టాలు అందించనున్నారు. ఇప్పటికే గుర్తించిన లబ్ధిదారుల్లో... 23లక్షల 37వేల 67 మందికి అభివృద్ధి చేసిన 17 వేలకు పైగా ‘వైయస్సార్ జగనన్న కాలనీ లేఅవుట్ల'లో స్థలాలు ఇస్తారు. మొత్తం 23 వేల 535 కోట్ల విలువైన 68 వేల 361 ఎకరాల భూమిని పేదలకు ఇవ్వనున్నారు. అందులో ప్రభుత్వ భూమి 25 వేల 120 ఎకరాలు కాగా, 10 వేల150 కోట్ల ఖర్చుతో 25 వేల 359 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. ఇప్పటికే స్థలాలు ఆక్రమించిన 4లక్షల 86వేల 820 మందికి క్రమబద్ధీకరిస్తారు. 2 లక్షల 51 వేల 868 మందికి టిడ్కో ఇళ్లు కేటాయిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒకటిన్నర, పట్టణాల్లో సెంటు భూమి ఇస్తారు. కేవలం రూపాయికే గృహిణి పేరుమీదుగా ఇంటి స్థలం పట్టా ఇస్తారు.
స్థలాలతో పాటు ఇళ్ల నిర్మాణం..
అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలతో పాటు 2 దశల్లో ఇళ్లు కూడా నిర్మించి ఇవ్వనున్నారు. మొత్తం 28.30 లక్షల ఇళ్ల నిర్మాణానికి 50వేల 940 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 340 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు నిర్మించి, మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. ప్రభుత్వ ఇళ్లు వద్దనుకునే వారికి ఆర్థిక సాయం చేసి... సొంతంగా కట్టుకునే అవకాశం కల్పిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ టిడ్కో ఇప్పటికే 2లక్షల 62వేల 216 ఇళ్ల నిర్మాణం చేపట్టింది. 300 చదరపు అడుగుల ఇళ్లకు కేవలం రూపాయి మాత్రమే తీసుకొని... అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేస్తారు. 365, 430 చదరపు అడుగుల ఇళ్ల లబ్దిదారులకు ప్రభుత్వం 50 శాతం రాయితీ ఇస్తోంది. వారు 25 వేలు, 50 వేలు చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. వారందరికి ఇవాల్టి నుంచే సేల్ అగ్రిమెంట్లు ఇవ్వనున్నారు.
ఇళ్ల పట్టాల పంపిణీల్లో అవకతవకలు జరిగాయంటూ పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించినందున... ఇప్పటికి ఆరుసార్లు ప్రక్రియ వాయిదా పడింది. ఈ పరిస్థితుల్లో కోర్టుల్లో పిటిషన్లు దాఖలైన, స్టే విధించిన ప్రాంతాల్లో మినహా మిగిలిన చోట్ల ఇవాళ ప్రక్రియ ప్రారంభిస్తోంది. ప్రస్తుతానికి డీ- ఫారం పట్టాలుగా పంపిణీ చేసి, కోర్టు ఉత్తర్వులు వెలువడ్డాక రిజిస్ట్రేషన్లు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు వైఎస్ఆర్ ఆశీస్సులతో ఇస్తున్న ఇంటిస్థలం అంటూ లబ్ధిదారులకు లేఖ రాసిన సీఎం... దేవుడి దయతో త్వరలోనే తన ఆశయం నెరవేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: ఘనంగా క్రిస్మస్ వేడుకలు... శోభాయమానంగా చర్చిలు