Rain In hyderabad: భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. భాజపా సభ జరుగుతున్న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ ప్రాంతంలో వర్షం కురిసింది. నగరంలోని బేగంబజార్, ఏంజే మార్కెట్, సుల్తాన్ బజార్, అబిడ్స్, బషీర్ బాగ్, నాంపల్లి, హిమాయత్ నగర్, నారాయణగూడ, లిబర్టీ పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది. పలుచోట్ల ఈదురు గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసింది. కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, హైదర్‌నగర్, నిజాంపేట్, ప్రగతినగర్ ప్రాంతాల్లో వర్షం పడింది.
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న భాజపా విజయ సంకల్ప సభకు భారీగా తరలివస్తున్న కార్యకర్తలు వర్షం రాకతో అసౌకర్యానికి గురయ్యారు. సభా ప్రాంగణంలో రెయిన్ ప్రూఫ్ టెంట్లు ఏర్పాట్లు చేశారు. భారీగా ఈదురుగాలు రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రహదారులపై నీరు పొంగిపొర్లడంతో పలు చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. రంగారెడ్డి రాజేంద్రనగర్, శంషాబాద్, కిస్మత్‌పురా, బండ్లగూడ జాగీర్, హైదర్షాకోట్, గండిపేట్‌లోనూ వర్షం దంచికొట్టింది.
రాష్ట్రంలో రాబోయే మూడు రోజులపాటు కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉపరితల ఆవర్తనం ఈ రోజు ఝార్ఖండ్ దాని పరిసరాల్లో కొనసాగుతూ సగటు సముద్రమమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం సంచాలకులు పేర్కొన్నారు. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో ఝార్ఖండ్ పరిసరాల్లో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని సంచాలకులు తెలిపారు. రాష్ట్రం వైపు కిందిస్థాయి గాలులు పశ్చిమ, నైరుతి దిశల నుంచి వీస్తున్నాయన్నారు.
ఇవీ చదవండి: 'అసదుద్దీన్ ఓవైసీ డ్రైవింగ్ చేస్తుంటే.. తెరాస పాలన నడిపిస్తోంది'
ఉగ్రవాదులను పట్టుకున్న కశ్మీరీలు.. పోలీసులకు అప్పగింత.. గవర్నర్ భారీ నజరానా