రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 70,974 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 315 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,61,866కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.
గడిచిన 24 గంటల వ్యవధిలో మరో ఇద్దరు బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కొవిడ్ మృతుల సంఖ్య 3,897కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలోనే 318 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 6,52,716కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,253 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
వైరస్ ముప్పు ఇంకా ఉంది..
కొత్త వేరియంట్ వస్తేనే మూడో వేవ్ వచ్చే అవకాశం ఉందని డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. కొవిడ్ ముప్పు పూర్తిగా తొలగిపోలేదని అన్నారు. అక్టోబర్ నెలాఖరుకు మరికొంత తగ్గే అవకాశం ఉందని చెప్పారు. హైదరాబాద్ మినహా మిగతా జిల్లాలో చాలా తక్కువగా కేసులు నమోదవుతున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 0.4 శాతం మాత్రమే ఉందని పేర్కొన్నారు. పిల్లలను విద్యాసంస్థలకు పంపవచ్చని తల్లిదండ్రులకు సూచించారు. 1.15 లక్షల విద్యార్థులకు పరీక్షలు చేస్తే 55 మందికి పాజిటివ్ వచ్చినట్లు వివరించారు.
ఇదీ చూడండి: DH on 3rd Wave: కరోనా కొత్త వేరియంట్ వస్తేనే మూడో వేవ్: డీహెచ్