అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ దాఖలు చేసిన వ్యాజ్యంపై నేడు సీబీఐ కోర్టులో విచారణ జరగనుంది. ముఖ్యమంత్రిగా రాష్ట్ర పాలన బాధ్యతలు నిర్వహించాల్సిన ఉన్నందున తన బదులుగా న్యాయవాది హాజరయ్యేలా అనుమతివ్వాలని జగన్ కోరారు. ప్రతీ శుక్రవారం విజయవాడ నుంచి హైదరాబాద్ రావడం వల్ల వారంలో రెండు రోజులు పడుతోందని... రాష్ట్ర ఆర్థిక, రెవెన్యూ పరిస్థితుల కారణంగా పాలన పై ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నందున మినహాయింపు ఇవ్వాలని కోరారు. అయితే జగన్ అభ్యర్థన పై సీబీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి అయినా.. సామాన్యులైనా చట్టం ముందు సమానులేనని... హోదాను చూసి మినహాయింపు ఇవ్వొద్దని కౌంటరు దాఖలు చేసింది. వ్యక్తిగత హాజరు మినహాయింపునిస్తే... కేసు విచారణ మరింత జాప్యం జరుగుతుందని పేర్కొంది. తన అధికారాన్ని ఉపయోగించి జగన్ సాక్షులను ప్రభావితం చేసే అవకాశం కూడా ఉందని ఆరోపించింది. ఇవాళ సీబీఐ కోర్టులో ఇరు వైపుల వాదనలు జరగనున్నాయి. జగన్ కేసులో భాగంగా పెన్నా సిమెంట్స్ వ్యవహారంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు పై అదనపు అభియోగపత్రం విచారణకు స్వీకరించాలా వద్దా అనే అంశంపై కూడా నేడు వాదనలు జరగనున్నాయి. ఓబుళాపురం గనుల కేసును విశాఖకు బదిలీ చేసే అంశంపై కూడా విచారణ జరగనుంది.
ఇదీ చదవండి : సాక్షుల్ని జగన్ ప్రభావితం చేయెుచ్చు!