కొవిడ్ సమయంలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం నుంచి ప్రజలను ఆదుకోవాలని తెజస అధ్యక్షుడు కోదండరాం(TJS president kodandaram) విజ్ఞప్తి చేశారు. అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో రేపు హైదరాబాద్లోని ఇందిరా పార్కు(indira park) వద్ద నిర్వహించే మహాధర్నాను(mahadharna) విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం 10 గంటలకు కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ, తెజస, తెదేపా పార్టీలు ఈ మహాధర్నాలో పాల్గొంటాయని కోదండరాం తెలిపారు.
తక్షణమే టీకాలివ్వాలి
ప్రజలకు కొవిడ్ రాకుండా ఉండేందుకు తక్షణమే అందరికీ టీకాలు(vaccines) వేయాలని కోదండరాం సూచించారు. కరోనా సమయంలో ఉద్యోగం కోల్పోయిన వారికి ఆర్థిక సహాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పనిదినాలను 200 రోజులకు పెంచి.. పట్టణాల్లో అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రజా సమస్యలపై పోరాడుతున్న వారిపై రాజద్రోహాం కేసులను ఉపసంహరించుకోవాలన్నారు.
పోడు భూముల సమస్యను పరిష్కరించాలి
రాష్ట్రంలో పోడు భూముల సమస్యను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. ధరణి పోర్టల్లో ఉన్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని.. రైతుల వద్ద నుంచి భూసేకరణను ఆపేయాలని కోదండరాం డిమాండ్ చేశారు. ఇప్పటికే సేకరించిన భూములకు పరిహారం చెల్లించాలన్నారు.
రేపు ఇందిరాపార్క్ వద్ద మహాధర్నాకు అఖిలపక్ష పార్టీలు పాల్గొంటాయి. రాష్ట్రంలో ముందుగా అందరికీ కొవిడ్ టీకాలు ఇవ్వాలి. ఉపాధి హామీ పథకం ద్వారా పట్టణాల్లోనూ పని కల్పించాలి. అదే విధంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలి. పోడు భూముల సమస్యను పరిష్కరించి రైతులకు పట్టాలివ్వాలి. విచ్చలవిడి భూసేకరణను ప్రభుత్వం ఆపేయ్యాలి. ఇప్పటికే తీసుకున్న భూమికి పరిహారం చెల్లించాలి. సమస్యలపై పోరాడుతున్న వారిపై రాజద్రోహం కేసులను ఉపసంహరించుకోవాలి. రేపు జరగబోయే మహాధర్నాను అందరూ కలిసి విజయవంతం చేయాలని కోరుతున్నా.- కోదండరాం, తెజస రాష్ట్ర అధ్యక్షుడు